హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో నార్త్స్టాండ్కు ఉన్న అజర్ పేరును తొలిగిస్తూ హెచ్‌సీఏ ఎథిక్స్ ఆఫీసర్, అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య శనివారం ఆదేశాలు జారీ చేశారు. లార్డ్స్ క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన జస్టిస్ ఈశ్వరయ్య..తాజా తీర్పు వెలువరించారు. 2019లో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా నార్త్స్టాండ్కు అజర్ తన పేరు పెట్టుకున్నాడు. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయాన్ని పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు పాల్పడినట్లు తేలడంతో హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య పేరు తొలిగింపునకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి తోడు ఇకపై ముద్రించే మ్యాచ్ టికెట్లపై కూడా అజర్ పేరు ఉండకూడదు అంటూ ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గతంలో ఇదే నార్త్స్టాండ్కు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేరును కొనసాగించాలని పిటీషనర్ తన పిల్లో కోరారు. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అంబుడ్స్‌మన్ తాజా నిర్ణయంతో ఉప్పల్ స్టేడియంలో అజర్ స్టాండ్‌కు తెరపడనుంది.