మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఇటలీ కుర్రాడు యానిక్ సిన్నర్.. టైటిల్ నిలబెట్టుకునే దిశగా మరో ముందడుగు వేశాడు. గురువారం ఇక్కడి రాడ్లీవర్ ఎరీనాలో జరిగిన పురుషుల రెండో రౌండ్లో ఒకటో సీడ్ సిన్నర్ 4-6, 6-4, 6-1, 6-3తో ట్రిస్టన్ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. గత మ్యాచ్‌లో అలవోకగా నెగ్గిన సిన్నర్ రెండో రౌండ్లో మాత్రం తొలి సెట్‌ను కోల్పోయాడు. కానీ ఆ తర్వాత అతడి జోరుకు ట్రిస్టన్ తేలిపోయాడు. మ్యాచ్‌లో సిన్నర్ 14 ఏస్‌లు, 42 విన్నర్లు కొట్టాడు. టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా ఉన్న డేనియల్ మెద్వెదెవ్ 3-6, 6-7 (4/7), 7-6 (10/8), 6-1, 6-7 (7/10)తో లర్నర్ టియెన్(అమెరికా) చేతిలో అనూహ్య ఓటమి ఎదుర్కొన్నాడు. మిగిలిన మ్యాచ్‌లలో 17వ సీడ్ అమెరికా ఆటగాడు ఫ్రాన్సెస్ టియోఫి 7-6 (7/3), 4-6, 6-3, 4-6, 1-6తో ఫాబియన్ (హంగేరి) చేతిలో ఓడాడు. మరో అమెరికా కుర్రాడు టేలర్ ఫ్రిట్జ్ 6-2, 6-1, 6-0తో క్రిస్టియన్ గారియన్ (చిలీ)ను చిత్తు చేశాడు.
మహిళల సింగిల్స్‌లో పోలండ్ సంచలనం ఇగా స్వియాటెక్ జోరు కొనసాగిస్తోంది. రెండో రౌండ్లో స్వియాటెక్ 6-0, 6-2తో రెబెక స్రమ్కొవ(స్లోవేకియా)పై అలవోక విజయం సాధించింది. తొలి సెట్‌ను 26 నిమిషాల్లోనే ముగించిన ఆమె ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా దక్కనివ్వలేదు. గంటా 9 నిమిషాల్లోనే స్వియాటెక్ మ్యాచ్‌ను గెలుచుకుంది. మూడో రౌండ్లో ఆమె బ్రిటన్ అమ్మాయి ఎమ్మా రదుకానుతో తలపడనుంది. నాలుగో సీడ్ జాస్మిన్ పౌలోని (ఇటలీ)6-2, 6-3తో రెనట (మెక్సికో)పై గెలిచింది. ఆరో సీడ్ ఎలీనా రిబాకినా 6-0, 6-3తో ఇవా జోవిక్ (అమెరికా)ను చిత్తుచేసింది.
ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత్ తరఫున ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా తొలి రౌండ్లోనే వెనుదిరుగుతున్నప్పటికీ డబుల్స్ విభాగంలో శ్రీరామ్ బాలాజీ-రెయెస్ వరెల (మెక్సికో) జోడీ రెండో రౌండ్‌కు చేరింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఈ ఇండో-మెక్సికన్ జంట 6-4, 6-3తో రాబిన్ హాసె (డచ్)-అలెగ్జాండర్(కజకిస్థాన్) ద్వయాన్ని ఓడించింది.
మెల్బోర్న్: గత కొద్దిరోజులుగా యూఎస్ఏలోని లాస్ ఏంజెల్స్‌లో చెలరేగుతున్న కార్చిచ్చుతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులవుతున్న నేపథ్యంలో ఆ బాధితులకు అమెరికా టెన్నిస్ ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్ అండగా నిలిచాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో తాను గెలవబోయే ప్రైజ్‌మనీని లాస్ ఏంజెల్స్ బాధితులకు అందజేయనున్నట్టు ఫ్రిట్జ్ తెలిపాడు. ఫ్రిట్జ్ కాలిఫోర్నియాలోనే పుట్టి పెరిగాడు. ఈ టోర్నీలో అతడితో పాటు పలువురు ఇతర ప్లేయర్లు సైతం లాస్ ఏంజెల్స్‌కు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.