మెల్బోర్న్ : సీజన్ ఆరంభ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో తొలి రోజు స్టార్ ప్లేయర్లు మొదటి రౌండ్ విఘ్నాన్ని విజయవంతంగా దాటారు. మహిళల సింగిల్స్‌లో గత సీజన్ ఫైనలిస్టులు అరీనా సబలెంక, కిన్వెన్ జెంగ్ శుభారంభం చేశారు. మెల్బోర్న్లోని రాడ్లీవర్ ఎరీనా వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో ఒకటో సీడ్ సబలెంక.. 6-3, 6-2తో స్లోన్ స్టీఫెన్స్ (యూఎస్)ను వరుస సెట్లలో చిత్తు చేసింది. 2017లో యూఎస్ టైటిల్ నెగ్గిన స్టీఫెన్స్.. పెద్దగా పోరాడకుండానే చేతులెత్తేసింది. మరో పోరులో చైనా అమ్మాయి, ఐదో సీడ్ జెంగ్.. 7-6 (7/3), 6-1తో అన్‌సీడెడ్ టొడొని (రొమానియా)ను ఓడించి రెండో రౌండ్‌కు ప్రవేశించింది.
మరో యువ సంచలనం మిర్రా ఆండ్రీవా.. 6-3, 6-3తో మేరీ బోజ్కొవను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్లు అలెగ్జాండర్ జ్వెరెవ్, కాస్పర్ రూడ్, నిషికొరి రెండో రౌండ్‌కు చేరారు. పలువురు ఆటగాళ్లు విజయం కోసం ఐదు సెట్ల పాటు శ్రమించక తప్పలేదు. రెండో సీడ్ జ్వెరెవ్.. 6-4, 6-4, 6-4తో లుకాస్ (ఫ్రాన్స్)ను వరుస సెట్లలో ఓడించాడు. ఆరో సీడ్ రూడ్ (నార్వే).. 6-3, 1-6, 7-5, 2-6, 6-1తో జామ్ మునార్ (స్పెయిన్)తో పోరాడి గెలిచాడు. నాలుగేండ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ ఆడుతున్న జపాన్ ఆటగాడు నిషికొరి.. 4-6, 6-7 (4/7), 7-5, 6-2, 6-3తో తియగొ మొంటిరియొ (బ్రెజిల్)ను ఇంటికి పంపాడు.
గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో సత్తా చాటిన భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ ఈసారి తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నాగల్.. 3-6, 1-6, 5-7తో థామస్ మెఖాక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓటమి పాలయ్యాడు.