లక్నో: తొలి పోరులో టీమ్ఇండియా చేతిలో పరాజయం పాలైన ఆస్ట్రేలియా.. వన్డే ప్రపంచకప్‌లో బోణీ కొట్టేందుకు సిద్ధమైంది. వరల్డ్‌కప్‌లోనే అత్యధిక స్కోరు చేసి ఫుల్‌జోష్‌లో ఉన్న దక్షిణాఫ్రికాతో గురువారం కంగారూలు అమీతుమీ తేల్చుకోనున్నారు. ఐదుసార్లు విశ్వ విజేతగా నిలిచిన ఆసీస్ ఈ సారి కూడా మెరుగైన జట్టుతోనే మెగాటోర్నీ బరిలో నిలువగా.. అండర్‌డాగ్స్‌గా అడుగుపెట్టిన సఫారీ జట్టు.. లంకపై రికార్డుల మోత మోగించిన విషయం తెలిసిందే.
చెన్నై వేదికగా రోహిత్ సేనతో జరిగిన పోరులో స్పిన్‌ను ఎదుర్కోలేక ఆసీస్ చేతులెత్తేయగా.. ఈ సారి లక్నో పిచ్‌పై మెరుగైన ప్రదర్శన కనబర్చాలని ఉవ్విళ్లూరుతున్నది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతున్న వరల్డ్‌కప్‌లో ప్రతీ మ్యాచ్ కీలకమే కావడంతో ఇరు జట్లు విజయంపైనే దృష్టిపెట్టాయి. భారత్‌తో పోరులో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ మినహా తక్కినవాళ్లంతా విఫలం కావడంతో.. ఈ సారి బ్యాటర్లు రాణించాలని ఆసీస్ మేనేజ్మెంట్ ఆశిస్తున్నది.