IND vs AUS | బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా, భారత జట్ల మధ్య మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 385 పరుగుల వద్ద ఏడో వికెట్‌ను కోల్పోయింది. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ 33 బంతుల్లో 23 పరుగులు చేసి మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ 100 ఓవర్లకు 403 పరుగులు చేసింది. ప్రస్తుతం అలెక్స్ కారీ 45, మిచెల్ స్టార్క్ 05 క్రీజులో ఉన్నారు.
అంతకుముందు శనివారం మొదలైన టెస్టు తొలి రోజు ఆటకు వరుణుడు ఆటంకం కల్గించాడు. టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్‌శర్మ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మబ్బులు కమ్ముకున్న వాతావరణాన్ని అంచనా వేస్తూ ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తేమతో కూడిన పిచ్‌పై టీమ్ఇండియా బౌలర్లను ఆసీస్ ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజ(19 నాటౌట్), నాథన్ మెక్‌స్వీని(4 నాటౌట్) చాకచక్యంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా స్టార్ పేసర్ బుమ్రా స్పెల్‌ను జాగ్రత్తగా ఆడారు. ఏ మాత్రం తొందరపాటు కనబర్చకుండా క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించారు.