మకాయ్ : దక్షిణాఫ్రికా పర్యటనను ఆస్ట్రేలియా విజయంతో ముగించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లను గెలుచుకుని సిరీస్ నెగ్గిన ఆతిథ్య సౌతాఫ్రికా మూడో మ్యాచ్‌లో దారుణంగా తడబడింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 431 పరుగుల భారీ స్కోరు చేసింది. వన్డేలలో ఆ జట్టుకు ఇది రెండో (434 హయ్యస్ట్) అత్యుత్తమ స్కోరు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (108 బంతుల్లో 142, 17 ఫోర్లు, 5 సిక్స్‌లు), మిచెల్ మార్ష్ (106 బంతుల్లో 100, 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకాలతో చెలరేగి తొలి వికెట్‌కు 250 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అనంతరం కామెరూన్ గ్రీన్ (55 బంతుల్లో 118 నాటౌట్, 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి శతకం బాదగా అలెక్స్ కేరీ (37 బంతుల్లో 50 నాటౌట్, 7 ఫోర్లు) సైతం ఓ చేయి వేయడంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. ఛేదనలో సఫారీలు 24.5 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలి 276 పరుగుల భారీ తేడాతో పరాభవాన్ని మూటగట్టుకున్నారు. వన్డేలలో దక్షిణాఫ్రికాకు పరుగుల పరంగా ఇదే అతిపెద్ద (గతంలో భారత్‌పై 243 రన్స్ తేడాతో అపజయం) ఓటమి. ఆసీస్ ఆల్‌రౌండర్ కూపర్ కనోలి (5/22) ధాటికి సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ కుదేలైంది. డెవాల్డ్ బ్రెవిస్ (49) టాప్ స్కోరర్. మూడో వన్డే ఓడినా 2-1తో సిరీస్ సఫారీల వశమైంది.