Australia: వన్డే వరల్డ్ కప్‌లో లీగ్ స్టేజ్ ముగింపుదశకు వచ్చింది. ఏదైనా మహా అద్భుతం జరిగితే తప్ప సెమీస్ బెర్తులు మారే అవకాశం లేదు. ఇప్పటికే ఇండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలు సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోగా లంకను ఓడించిన న్యూజిలాండ్ కూడా నాలుగో జట్టుగా చేరినా (?) పాకిస్తాన్, ఇంగ్లండ్‌పై భారీ విజయం సాధిస్తే ఆ జట్టుకూ అవకాశాలుంటాయి. అయితే సెమీస్‌కు చేరిన జట్లలో ఆస్ట్రేలియా ఉండటం ప్రత్యర్థులకు కంగారుపుట్టించే అంశమే. వన్డే ప్రపంచకప్‌లో ఆ జట్టుకు ఉన్న చరిత్ర ఆషామాషీది కాదు.
ఇప్పటివరకు 12 వన్డే ప్రపంచకప్‌లు జరుగగా ప్రస్తుతం జరుగుతున్నది 13వ ఎడిషన్. 13 సార్లలో ఆసీస్ సెమీఫైనల్‌కు చేరడం ఇది ఏకంగా తొమ్మిదోసారి. ప్రపంచంలో మరే జట్టూ ఇన్నిసార్లు సెమీస్‌కు చేరలేదు. 1975, 1987, 1996, 1999, 2003, 2007, 2015, 2019లలో కంగారూలు సెమీస్‌కు చేరారు. ఎనిమిది సెమీఫైనల్స్‌లో.. 6 గెలిచి ఒకటి ఓడి ఒక మ్యాచ్ టై చేసుకుంది. ఏడు సార్లు ఫైనల్ చేరిన ఆసీస్.. ఏకంగా ఐదు సార్లు ట్రోఫీ నెగ్గడం గమనార్హం. 2023 ఎడిషన్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఓడి పాయింట్ల పట్టికలో పదో స్థానంలో ఉన్న ఆసీస్.. తర్వాత పుంజుకుని వరుసగా ఆరు మ్యాచ్‌లలో గెలిచింది.
తొలి ప్రపంచకప్‌లో ఆసీస్ – ఇంగ్లండ్ మధ్య సెమీస్ జరుగగా విజయం ఆస్ట్రేలియాదే. ఆ తర్వాత వరుస ప్రపంచకప్‌లలో పాకిస్తాన్, వెస్టిండీస్‌ల పైనా ఆసీస్‌దే ఆధిక్యం. 1999 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో సెమీస్ టై అయింది. 2003 లో శ్రీలంకపై నెగ్గిన ఆసీస్.. ఆ తర్వాత సౌతాఫ్రికా, ఇండియా పై గెలిచింది. గత ప్రపంచకప్‌లో మాత్రం ఇంగ్లండ్ చేతిలో ఓడింది. వరల్డ్ కప్ సెమీస్‌లో ఆసీస్‌కు ఇదే తొలి సెమీస్ ఓటమి.
మళ్లీ సఫారీలతోనే..
ఈ మెగా టోర్నీలో ఆసీస్.. సౌతాఫ్రికాతో సెమీస్ ఆడటం ఇది మూడోసారి కానుంది. 1999 ప్రపంచకప్‌లో సఫారీలతో సెమీస్ మ్యాచ్ టై అయింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 49.2 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం సౌతాఫ్రికా 49.4 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో ఆసీస్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక 2007 ప్రపంచకప్ సెమీస్‌లో సౌతాఫ్రికా.. 149 పరుగులకే ఆలౌట్ కాగా లక్ష్యాన్ని ఆసీస్.. 31 ఓవర్లోనే ఛేదించింది. మరి 2023లో అదృష్టం ఎవరిని వరించేనో..?