కింగ్స్టన్ (జమైకా) : సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో వెస్టిండీస్.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో కంగారూలను 121 పరుగులకే కట్టడిచేశామని సంబురపడేలోపే ఆసీస్ పేసర్ల ధాటికి కరీబియన్లు విలవిల్లాడారు. దీంతో 204 పరుగుల ఛేదనలో విండీస్.. 27 పరుగులకే చాపచుట్టేయడంతో పర్యాటక జట్టు 176 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోరు. 1955లో న్యూజిలాండ్.. ఇంగ్లండ్‌తో ఆడిన మ్యాచ్‌లో 26 రన్స్‌కు ఆలౌట్ అవగా ఆ రికార్డును విండీస్ తృటిలో తప్పించుకుంది. ఇక తన కెరీర్లో వందో టెస్టు మ్యాచ్ ఆడిన ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్.. సబీనా పార్క్ (కింగ్స్టన్)లో నిప్పులు చెరిగాడు. 15 బంతుల వ్యవధిలో అతడు ఏకంగా 5 వికెట్లు పడగొట్టడం విశేషం.
అతడు మొత్తంగా 7.3 ఓవర్లు బౌలింగ్ చేసి 4 మెయిడిన్లు వేయడమే గాక 9 పరుగులే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. స్టార్క్ తను వేసిన తొలి ఓవర్లోనే ఏకంగా మూడు వికెట్లు తీయడం గమనార్హం. స్టార్క్‌కు తోడు స్కాట్ బొలాండ్ (3/2) హ్యాట్రిక్‌తో విజృంభించడంతో విండీస్ ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. ఆసీస్ పేస్ త్రయం ధాటికి విండీస్ ఇన్నింగ్స్ 14.3 ఓవర్లకే ముగియడం విశేషం. ఆ జట్టులో జస్టిన్ గ్రీవ్స్ (11) ఒక్కడే రెండంకెల స్కోరు చేయగా ఏకంగా ఏడుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీయడంతో స్టార్క్.. ఆసీస్ తరఫున 400 వికెట్లు (టెస్టుల్లో) పడగొట్టిన నాలుగో బౌలర్ (రెండో పేసర్)గా నిలిచాడు. తొలి మూడు స్థానాల్లో షేన్ వార్న్, గ్లెన్ మెక్‌గ్రాత్, నాథన్ లియాన్ ఉన్నారు. ఈ సిరీస్‌లో 15 వికెట్లు పడగొట్టిన స్టార్క్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులూ దక్కాయి.
ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్: 225, వెస్టిండీస్ ఫస్ట్ ఇన్నింగ్స్: 143,
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ :121, వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 27
1 వెస్టిండీస్‌కు ఏ ఫార్మాట్లో అయినా ఇదే అత్యల్ప స్కోరు.
1 ఒక బౌలర్ 15 బంతుల వ్యవధిలోనే 5 వికెట్లు తీయడం టెస్టుల్లో ఇదే ప్రథమం. 1947లో ఎర్నీ టోషక్.. 1947లో భారత్‌తో మ్యాచ్‌లో 19 బంతుల వ్యవధిలోనే ఫైఫర్ తీయడమే ఇప్పటిదాకా రికార్డు.
9 విండీస్ ఇన్నింగ్స్‌లో ఏడుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. టెస్టుల్లో ఇలా జరుగడం ఇది తొమ్మిదోసారి.
26 – న్యూజిలాండ్ – ఇంగ్లండ్‌పై (1955లో)
27- వెస్టిండీస్ – ఆస్ట్రేలియాపై (2025లో)
30- దక్షిణాఫ్రికా – ఇంగ్లండ్‌పై (1896లో)
30- దక్షిణాఫ్రికా – ఇంగ్లండ్‌పై (1924లో)