కాన్పూర్: ఆస్ట్రేలియా ఏ జట్టుకు చెందిన ఫాస్ట్ బౌలర్ హెన్రీ థార్న్‌టన్‌కు ఫుడ్ పాయిజన్(Food Poison) అయ్యింది. దీంతో అతన్ని కాన్పూర్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్ట్రేలియా ఏ జట్టుతో ఇండియా ఏ వన్డే సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. థార్న్టన్ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాడు. సిటీలో ఉన్న రీజెన్సీ హాస్పిటల్లో చేర్పించినట్లు అధికారులు తెలిపారు. టీమ్ బస చేస్తున్న హోటల్లో ఆహారం తిన్న తర్వాత అతనికి ఉదర సంబంధిత సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది. తొలుత టీమ్ మేనేజ్మెంట్ ప్రాథమిక చికిత్స అందించింది. ఆ తర్వాత ఆస్పత్రిలో సీనియర్ల డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స కొనసాగింది.
అయితే కాన్పూర్‌కు రావడానికి ముందే గ్యాస్ట్రో లక్షణాలతో థార్న్టన్ బాధపడుతున్నట్లు టీమ్ మేనేజర్ తెలిపాడు. ఈ ఘటన నేపథ్యంలో ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్మెంట్ డైయిట్ ప్లాన్‌లో మార్పులు చేసింది. మరో ముగ్గురు ఆటగాళ్లు కూడా ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడ్డారు. కానీ వాళ్లను ఆస్పత్రిలో చేర్పించలేదు. ఆస్ట్రేలియా ఏ, ఇండియా ఏ మధ్య జరిగిన రెండో వన్డేలో .. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా విజయాన్ని నమోదు చేసింది. 1-1 తేడాతో రెండు జట్లు సమంగా ఉన్నాయి. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనున్నది.