AUS vs NED | కొండంత లక్ష్యాన్ని కరిగించేందుకు బ్యాటింగ్‌కు వచ్చిన నెదర్లాండ్స్‌కు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. 400 పరుగుల ఛేదనలో డచ్ జట్టు.. 15 ఓవర్ల లోపే ఐదు కీలక వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. జోరుమీదున్న ఆసీస్ పేస్ త్రయం మిచెల్ స్టార్క్, జోష్ హెజిల్వుడ్, పాట్ కమిన్స్‌లు డచ్ బ్యాటర్లను క్రీజులో నిలదొక్కుకోనీయడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓటమిని తప్పించుకోవడం సంగతి అటుంచితే నెదర్లాండ్స్ కనీసం వంద పరుగులవరకైనా చేయగలుగుతుందా..? అన్నది నెదర్లాండ్స్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నది.
400 పరుగుల ఛేదనలో డచ్ జట్టు ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించేందుకు యత్నించింది. హెజిల్వుడ్ వేసిన రెండో ఓవర్లో మ్యాక్స్ ఓడౌడ్ (6) ఓ ఫోర్ కొట్టగా విక్రమ్‌జిత్ సింగ్ కూడా రెండు బౌండరీలు బాదాడు. స్టార్క్ వేసిన 3వ ఓవర్లో విక్రమ్‌జిత్.. మరో రెండు ఫోర్లు కొట్టాడు. కానీ మిచెల్ స్టార్క్ డచ్ జట్టుకు తొలి షాకిచ్చాడు. అతడు వేసిన ఐదో ఓవర్లో ఐదో బంతికి ఓడౌడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
మరుసటి ఓవర్లో విక్రమ్‌జిత్ సింగ్ (25 బంతుల్లో 25, 6 ఫోర్లు) రనౌట్ అయ్యాడు. మ్యాక్స్‌వెల్ సూపర్ త్రో తో విక్రమ్ కథ ముగిసింది. 11 బంతుల్లో 10 పరుగులు చేసిన కొలిన్ అకర్‌మన్‌ను హెజిల్వుడ్ పదో ఓవర్లో రెండో బంతికి ఎల్బీగా ఔట్ చేశాడు. ఇక కమిన్స్ వేసిన 11వ ఓవర్లో ఐదో బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. 14 ఓవర్లు ముగిసేటప్పటికీ నెదర్లాండ్స్.. 5 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. స్కాట్ ఎడ్వర్స్ (2 బ్యాటింగ్), తేజ నిడమనూరు (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.