Aus vs Eng | ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు ఆటగాళ్ల జాబితాలో కచ్చితంగా చేరే పేరు ఇంగ్లండ్ సారధి జో రూట్. అయితే అతను కేవలం గొప్ప ఆటగాడేనని, మంచి నాయకుడు మాత్రం కాదని న్యూజిల్యాండ్ దిగ్గజం బ్రెండన్ మెకల్లమ్ అభిప్రాయపడ్డాడు. తనకు రూట్లో నాయకత్వ లక్షణాలు కనిపించలేదని ఈ మాజీ కివీస్ ప్లేయర్ తేల్చేశాడు. రూట్ చాలా అద్భుతమైన వ్యక్తి, సత్తా ఉన్న ఆటగాడే కానీ.. గొప్ప నాయకుడు మాత్రం కాదని మెకల్లమ్ స్పష్టంగా చెప్పాడు.
యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. ఈ క్రమంలోనే మెకల్లమ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తొలి టెస్టులో ఇంగ్లండ్‌కు గెలిచే అవకాశాలు దక్కాయని, కానీ వాటిని ఆ జట్టు అందిపుచ్చుకోలేకపోయిందని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా జట్టు ఒళ్లు విరుచుకోగానే ఇంగ్లండ్ జట్టు కనిపించకుండా పోయిందని సెటైర్లు వేశాడు.
యాషెస్ తొలి టెస్టు ఓటమి ఈ ఏడాదిలో ఇంగ్లిష్ జట్టుకు ఏడవది. ఇప్పటి వరకూ ఒక ఏడాదిలో ఇంగ్లండ్ ఎదుర్కొన్న అత్యధిక పరాజయాలు ఎనిమిది. మొత్తం క్రికెట్ చరిత్రలో ఒక ఏడాదిలో 9 టెస్టు ఓటములతో బంగ్లాదేశ్ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంది. ‘రూట్ చాలా మంచి వ్యక్తి, అద్భుతమైన ఆటగాడే.
అతను గొప్ప నాయకుడని అంటున్నారు కానీ నాకు అలా ఏమీ కనిపించడం లేదు. తొలి టెస్టులో ఇంగ్లండ్‌కు అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని అందుకోవడంలో విఫలమైంది. వాళ్లకు ఆ సత్తా లేకపోయింది.’ అని అన్నాడు. ఆస్ట్రేలియాకు పోరాడే అవకాశం రూటే స్వయంగా ఇచ్చాడని, ఇలాంటి అవకాశాలను ఆసీస్ జట్టు అస్సలు వదులుకోదని తెలిపాడు.