హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు పురస్కరించుకుని సాట్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మహిళల చెస్ చాంపియన్‌షిప్ గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. 33 జిల్లాల్లో యువజన క్రీడా సంక్షేమ శాఖ అధికారులు తొలిరోజు పోటీలను విజయవంతం చేశారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు టోర్నీని ప్రారంభించగా, మరికొన్ని జిల్లాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, అదనపు కలెక్టర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలికలు, మహిళల్లో దాగున్న ప్రతిభను వెలికి తీసే ఉద్దేశంతో నిర్వహించిన ఈ చెస్ టోర్నీలు ఉత్సాహంగా సాగాయి. సాయంత్రం బహుమతి ప్రదాన కార్యక్రమంలో విజేతలకు నిర్వాహకులు ట్రోఫీలు, పతకాలు అందజేశారు. జిల్లా స్థాయిలో టాప్-2లో నిలిచిన ప్లేయర్లు శుక్రవారం ఫైనల్ పోటీల్లో తలపడుతారని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పేర్కొన్నారు.