Ramesh Nagapuri | ఢిల్లీ: భారత అథ్లెటిక్స్‌లో మరో కుదుపు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత, నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ చీఫ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న నాగపూరి రమేశ్‌పై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) సస్పెన్షన్ వేటు వేసింది. రమేశ్ దగ్గర శిక్షణ తీసుకున్న ఇద్దరు అథ్లెట్లు డోప్ టెస్టుకు నిరాకరించారనీ, ఆ విషయంలో ఆయన హస్తముందన్న ఆరోపణలతో నాడా నాగపురిపై తాత్కాలిక నిషేధం విధించింది. రమేశ్‌తో పాటు మరో ఇద్దరు కోచ్‌లు కరమ్‌వీర్ సింగ్, రాకేశ్ సైతం సస్పెన్షన్‌కు గురయ్యారు. కోచ్‌లే గాక ఏడుగురు అథ్లెట్లపైనా నాడా కొరడా ఝుళిపించింది. డోప్ టెస్టులను దాటవేసినందుకు గాను పరాస్ సింఘాల్, పూజా రాణి, నలబోతు షణ్ముగ శ్రీనివాస్, చెల్మి ప్రత్యూష, శుభమ్ మహర, కిరణ్, జ్యోతి పైనా వేటు పడింది.
తెలుగు రాష్ర్టాల్లో దీప్తి జివాంజి, ద్యుతి చంద్, నందిని వంటి మట్టిలో మాణిక్యాలను వెలికితీసి వారిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన రమేశ్.. హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) నుంచి 2023లో జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ కోచ్‌గా వెళ్లారు. వరంగల్ జిల్లాకు చెందిన ఆయన.. తెలుగు రాష్ర్టాల నుంచి ద్రోణాచార్య అవార్డు (2016లో) పొందిన తొలి కోచ్‌గా గుర్తింపు పొందారు. సుమారు రెండున్నర దశాబ్దాలుగా ఆయన కోచింగ్ బాధ్యతలను నిర్వర్తిసున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు అథ్లెట్ల డోప్ టెస్టుల విషయంలో రమేశ్ వారికి సహకరించారని, వారినుంచి శాంపిల్స్ తీసుకోకుండా దాటవేయడంలో ఆయన పాత్ర ఉందని ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలో 2021, నాడా యాంటీ డోపింగ్ రూల్స్‌లోని ఆర్టికల్ 2.9 ప్రకారం రమేశ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఒక కోచ్‌పై సస్పెన్షన్ వేటు పడటం ఇదే మొదటిసారి కాదు. 2022లో ముంబైకి చెందిన అథ్లెటిక్స్ కోచ్ మిక్కీ మెనెజెస్.. తన ట్రైనీ కృతికి నిషేధిత ఉత్ప్రేరకాలు ఇచ్చినందుకు గాను అతడిపై రెండేండ్ల నిషేధం పడింది. అయితే రమేశ్‌పై వేటు వేసిన నాడా.. అది ఎంతకాలం అనేదానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు.
‘నేనెప్పుడూ తప్పుడు పనులు చేయలేదు. చేసినవారినీ ప్రోత్సహించలేదు. ఇరు తెలుగు రాష్ర్టాల్లోని ప్రతిభావంతులైన పేద క్రీడాకారులను వెలికితీసేందుకు నా జీవితాన్ని ధారపోశా. ఈ విషయం (నాడా సస్పెన్షన్)లో నేను ఎలాంటి విచారణకైనా సిద్ధం.’