షిమ్కెంట్ (కజకిస్థాన్) : ఏషియా షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత షూటర్ల పతక వేట దిగ్విజయంగా కొనసాగుతున్నది. మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో తెలంగాణ అమ్మాయి సురభి భరద్వాజ్, మానిని, వినోద్ విద్సరతో కూడిన త్రయం రజతం గెలుచుకుంది. ఫైనల్లో ఈ ము గ్గురూ 1846 పాయింట్లు స్కోరు చేసి రజతం సాధించగా దక్షిణ కొరియా 1856.8 పాయింట్లతో స్వర్ణం, కజకిస్థాన్ (1828.2) కాంస్యం దక్కించుకున్నాయి. యువ షూటర్ మానిని.. ఇదే విభాగం వ్యక్తిగత ఈవెంట్లో 617.8 పాయింట్లతో కాంస్యం గెలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో తొలి పతకాన్ని ఖాతాలో వేసుకుంది.
యువ పిస్టోల్ షూటర్ రాజ్కన్వర్ సింగ్ సంధు పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ కొట్టాడు. 23 ఏండ్ల రాజ్కన్వర్.. 583 స్కోరుతో బంగారు పతకం గెలిచాడు. భారత్‌కే చెందిన గురుప్రీత్ సింగ్ నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే ఇదే విభాగం టీమ్ ఈవెంట్లో గుర్ప్రీత్, రాజ్కన్వర్, అంకుర్ గోయెల్ త్రయం స్వర్ణం నెగ్గింది. గుర్ప్రీత్ సింగ్ 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టోల్ వ్యక్తిగత విభాగంలోనూ గోల్డ్ కైవసం చేసుకున్నాడు. డబుల్ ట్రాప్ షూటర్ అంకుర్ మిట్టల్ కూడా స్వర్ణం గెలిచాడు. ఇదే విభాగపు టీమ్ ఈవెంట్లో అంకుర్, ప్రతాప్, హర్షవర్దన్ త్రయం కాంస్యం సాధించింది.