Prajnesh Gunneswaran : ఆసియా క్రీడల విజేత ప్రజ్నేష్ గున్నేశ్వరన్ (Prajnesh Gunneswaran) టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి వైదొలుగుతున్నట్టు శుక్రవారం ప్రజ్నేష్ వెల్లడించాడు. 35 ఏండ్ల వయసులో ఆటకు అల్విదా చెప్పుస్తున్నానని ప్రజ్నేష్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపాడు. సుదీర్ఘ కెరీర్‌కు గుడ్ బై చెప్పేసిన ప్రజ్నేష్కు టెన్నిస్ దిగ్గాలు లియాండర్ పేస్, మహేశ్ భూపతిలు అభినందనలు తెలియజేశారు.
రెండేండ్ల క్రితం ఆసియా క్రీడల్లో అదరగొట్టిన ఇతడు కాంస్య పతకం సాధించాడు. దాంతో, సింగిల్స్‌లో అత్యుత్తమంగా 75వ ర్యాంకుకు చేరుకున్నాడు. ‘మాండేలి టు మెల్బోర్న’ అనే టైటిల్‌తో తన రిటైర్మెంట్ వార్తను అభిమానులతో పంచుకన్న ప్రజ్నేష్ ఏమేం రాసుకొచ్చాడంటే..?
‘నేను రాకెట్ వదిలేస్తున్నా. ధన్యవాదాలు. ఈ పోస్ట్ రాస్తున్నప్పుడు కృతజ్ఞతా భావంతో, గర్వంతో పాటు అమూల్యమైన జ్ఞాపకాలతో నా హృదయం నిండిపోయింది. ఈ రోజు నేను చివరిసారిగా ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడేందుకు టెన్నిస్ కోర్టులోకి వచ్చాను. దాదాపు 30 ఏండ్లుగా ఈ ఆటే నాకు పరమ పవిత్రమైనది. నా గురువు. నాకు ఎంతో నమ్మకమైన భాగస్వామి కూడా. విశ్వ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించడం, ఇన్నేండ్ల నా ప్రయాణం అసాధారణమైనది’ అని ప్రజ్నేష్ తన వీడ్కోలు సందేశంలో రాసుకొచ్చాడు.
చెన్నైలోని మండవేలికి చెందిన ప్రజ్నేష్కు చిన్నప్పటి నుంచి టెన్నిస్ అంటే ఇష్టం. ఐదేండ్లప్పుడే అతడు రాకెట్ పట్టుకున్నాడు. ప్రజ్నేష్ ఉత్సాహాన్ని గమనించిన తల్లిదండ్రులు అతడు టీనేజ్‌కు రాగానే పుణే, బెంగళూరులో శిక్షణ ఇప్పించారు. కోచ్‌ల పర్యవేక్షణలో రాటుదేలిన ప్రజ్నేష్ అండర్ -12, అండర్ -18 విభాగాల్లో అద్భుతంగా రాణించాడు. కెరీర్ ఆరంభంలో విజయవంతమైన అతడు ఆ తర్వాత పెద్దగా ఆడలేదు. 2009లో ఎడమ చేతికి గాయం కావడం అతడి కెరీర్‌ను ప్రశ్నార్ధకం చేసింది.
అమెరికాలోని ఓ యూనివర్సిటీ అతడికి స్కాలర్షిప్ ఇవ్వడంతో అక్కడికి వెళ్లిపోయాడు. కానీ, టెన్నిస్‌పై ఉన్న ఇష్టం అతడిని కుదరుగా ఉండనివ్వలేదు. దాంతో 2010లో కాలేజీ వదిలేసి ప్రొఫెషనల్ టెన్నిస్‌ను కొనసాగించాడు. 2018లో కున్నమింగ్ ఓపెన్‌లో ఏటీపీ చాలెంజర్ సింగిల్స్ టైటిల్ గెలుపొందడం ప్రజ్నేష్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ మరుసటి ఏడాది అతడు అన్ని గ్రాండ్‌స్లామ్ టోర్నీల మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు.