Ashwin : భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) జోరు పెంచాడు. ఈమధ్యే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన ఈ దిగ్గజం విదేశీ లీగ్స్‌లో మెరిసేందుకు సిద్దమవుతున్నాడు. అలా అనీ ఒకటి రెండు లీగ్స్‌కే పరిమితం కావాలని ఈ వెటరన్ ప్లేయర్ అనుకోవడం లేదు. అవకాశం ఉన్న ప్రతి లీగ్‌లో తన ముద్ర వేయాలనే కసితో ఉన్నాడు. అవును.. ఒకే ఏడాదిలో మూడు విదేశీ లీగ్స్‌లో ఆడేందుకు సై అంటున్నాడు అశ్విన్. ఇదివరకే హాంకాంగ్ సిక్సర్స్(HongKong Sixers) టోర్నీలో ఆడేందుకు ఓకే చెప్పిన అశ్విన్.. ఇంటర్నేషనల్ టీ20తో పాటు బిగ్‌బాష్ లీగ్‌లోనూ మెరవనున్నాడు.
టీమిండియా స్పిన్ లెజెండ్ అయిన అశ్విన్ ఐపీఎల్ వీడ్కోలు ప్రకటనలో తాను విదేశీ లీగ్స్‌పై దృష్టి సారిస్తానని చెప్పాడు. అతడలా చెప్పడమే ఆలస్యం.. పలు దేశాల ఫ్రాంచైలు మేము తీసుకుంటాం అని ముందుకొచ్చాయి. యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషన్ లీగ్ 20, దక్షిణాఫ్రికాలో నిర్వహించే బెట్‌వే ఎస్ఏ20(betway SA20), ఆస్ట్రేలియాలోని ‘బిగ్‌బాష్ లీగ్'(Big Bash League), ఇంగ్లండ్ గడ్డపై పావులర్ అయిన ‘ది హండ్రెడ్ లీగ్’ (The Hundred League).. ఇలా అశ్విన్ కోసం పావులు కదిపాయి. అయితే.. అశ్విన్ మాత్రం ఏమాత్రం తొందరపడకుండా మొదట తాను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన హాంకాంగ్ సిక్సర్స్‌కు పచ్చజెండా ఊపాడు.
🚨 ASHWIN TO BIG BASH TIME. 🚨
– Sydney Thunder, Hobart Hurricanes, Sydney Sixers and Adelaide Strikers are interested in having Ravi Ashwin in the BBL. (Espncricinfo). pic.twitter.com/p4JttPijEY
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 23, 2025
వారం రోజుల వ్యవధిలోనే ఈ స్పిన్ మాంత్రికుడు బీబీఎల్‌తో పాటు ఐఎల్20ల్లోనూ తన మార్క్ చూపించాలని ఆరాటపడుతున్నాడు. అందుకే.. ఐఎల్20 వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు అశ్విన్. ‘ఐఎల్20 నాలుగో సీజన్ వేలంలో పేరు రిజిష్టర్ చేసుకున్నాను. ఆరు జట్లు నాకోసం పోటీపడడం ఆసక్తిగా ఉండనుంది’ అని అతడు వెల్లడించాడు. ఇక బీబీఎల్ జట్లు.. సిడ్నీ సిక్సర్స్, హొబర్ట్ హరికేన్స్, ఆడిలైడ్ స్ట్రయికర్స్ వంటి ఫ్రాంచైజీలు అతడిని భారీగా డబ్బులు ఆఫర్ చేస్తున్నాయి. దాంతో.. ఈ ఏడాదిలో రెండు లీగ్స్‌లో ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడీ సీఎస్కే మాజీ ప్లేయర్.
ఇంటర్నేషనల్ లీగ్ 20 నాలుగో సీజన్ వేలం దుబాయ్‌లో అక్టోబర్ 1న జరుగనుంది. ఈ లీగ్‌లోని ఆరు జట్లలో ఒకటి అశ్విన్‌ను భారీ ధరకు పట్టేసే అవకాశముంది. డిసెంబర్ 2 నుంచి ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ మధ్యలోనే డిసెంబర్ 14 నుంచి బిగ్‌బాష్ లీగ్ షురూ అవుతుంది. ఐఎల్20 జనవరి 4న ముగియగానే అశ్విన్ బీబీఎల్ కోసం ఆస్ట్రేలియాలో వాలిపోతాడు. ఈ టోర్నీ జనవరి 25న ఫైన్‌లో ముగుస్తుంది.
ఒకవేళ ఐఎల్20లో అశ్విన్ ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు నాకౌట్ దశలోనే ఇంటిదారి పడితే.. అతడు త్వరగానే బీబీఎల్ జట్టుతో కలిసే అవకాశముంది. అంతేకాదు.. షెడ్యూల్ కుదిరిలో అమెరికాలో జరిగే మేజర్ క్రికెట్ లీగ్‌తో పాటు ఇంగ్లండ్ వేదికగా సాగే ది హండ్రెడ్ లీగ్‌లోనూ ఈ ఆఫ్ స్పిన్నర్ ఆడినా ఆశ్చర్యపోనవసరం లేదు.