బ్రిస్బేన్: యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకే ఆసీస్ బౌలర్లు కుప్పకూల్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ (94), మార్నస్ లబుషేన్ (74), ట్రావిస్ హెడ్ (152) రాణించడంతో 425 పరుగులు చేసి ఆలౌటయింది.
278 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ గట్టి పోటీనిస్తోంది. ఓపెనర్లు హసీబ్ హమీద్ (27), రోరీ బర్న్స్ (13) మరోసారి నిరాశపరిచారు. అయితే కెప్టెన్ జోరూట్ (86 నాటౌట్), డేవిడ్ మలన్ (80 నాటౌట్) రాణించారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 220/2 స్కోరుతో నిలిచింది. ఆసీస్ కన్నా 58 పరుగులు వెనుకబడి ఉంది.
జో రూట్ రికార్డు
యాషెస్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ సారధి జోరూట్ రికార్డు బద్దలు కొట్టాడు. ఒక క్యాలెండర్ ఏడాదిలో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాదిలో రూట్ ఏకంగా 1541 పరుగులు చేశాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ సారధి మైకెల్ వాగన్ పేరిట ఉండేది. 2002లో ఈ మాజీ సారధి 1481 రన్స్ చేశాడు. ఈ రికార్డును ఇప్పుడు రూట్ బద్దలుకొట్టాడు.