Daniel Gidney | లండన్: క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన యూకేలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘కౌంటీ చాంపియన్‌షిప్’ ప్రతిష్ట నానాటికీ మసకబారుతుందని, కానీ భారత్‌లో దేశవాళీ క్రికెట్ మాత్రం అద్భుతంగా పురోగమిస్తుందని లంకాషైర్ సీఈవో డేనియల్ గిడ్నీ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడే ఆటగాళ్లతో దేశవాళీలు ఆడించడం మంచి విషయమని ప్రశంసలు కురిపించాడు.
ఇంగ్లండ్ క్రికెటర్లు కౌంటీ చాంపియన్‌షిప్‌ను పెద్దగా పట్టించుకోరని.. అయితే ఇందులో ఆటగాళ్ల, అడ్మినిస్ట్రేటర్లు, కోచ్‌ల కంటే ఏజెంట్ల పాత్ర కీలకమని చెప్పాడు. వారి వల్లే కౌంటీ క్రికెట్ భవిష్యత్ ప్రమాదంలో పడిందని ఆయన అన్నాడు.
ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిడ్నీ మాట్లాడుతూ.. ‘ఒక గవర్నింగ్ బాడీ ఇలా (జాతీయ జట్టు క్రికెటర్లు దేశవాళీలో ఆడేలా ఆదేశించడం) చెప్పడం గొప్ప విషయం. కానీ మాకు (ఇంగ్లండ్‌లో) అలా జరగడం లేదు. ఇక్కడ ఉండే ఏజెంట్లు కౌంటీ చాంపియన్‌షిప్‌ను అసలు కేర్ చేయరు. ఇంగ్లండ్ ఆటగాళ్లు కౌంటీలు ఆడేందుకు ఇష్టపడరు’ అని అన్నాడు.