US Open : యూఎస్ ఓపెన్‌లో టాప్ సీడ్ అరీనా సంబలెంకా (Aryna Sablenka) చరిత్ర సృష్టించింది. ఈ మెగా టోర్నీ చరిత్రలో వరుసగా రెండోసారి ట్రోఫీని అందుకున్న రెండో క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో అమెరికాకు చెందిన అమందా అనిసిమోవా (Amanda Anisimova)ను ఓడించింది సబెలంకా. దాదాపు గంట 34 నిమిషాలు జరిగిన పోరులో మట్టికరిపించింది. వరుస సెట్లలో జోరు చూపించిన ఆమె ప్రత్యర్థి గ్రాండ్‌స్లామ్ కలను కల్లలు చేసింది.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా యూఎస్ ఓపెన్‌లో అడుగుపెట్టిన సబలెంకా ఆద్యంతం అదరగొట్టింది. సెమీ ఫైనల్లో బలమైన జెస్సికా పెగులాను ఓడించి ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్న ఈ బెలారస్ భామ టైటిల్ పోరులోనూ తన తడాఖా చూపించింది. రెండు సెట్లలోనూ అమందను నిలువరించి 6-3, 7-6(3)తో గెలుపొందింది సబలెంకా. దాంతో.. వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరినా అమందకు నిరాశ తప్పలేదు.
విన్నింగ్ పాయింట్ సాధించిన తర్వాత సబలెంకా కోర్టులోనే మోకాళ్లపై కూర్చుండిపోయింది. తద్వారా వెటరన్ సెరీనా విలియమ్స్ (Serena Williams) తర్వాత వరుసగా రెండో టైటిల్ సాధించిన రికార్డు సొంతం చేసుకుందీ విజేత. అమెరికా నల్ల కలువగా పేరొందిన సెరీనా 2013, 2014లో యూఎస్ ఓపెన్ ట్రోఫీని ముద్దాడింది.
ARYNA SABALENKA CLINCHES HER FOURTH GRAND SLAM TITLE! 🏆🏆🏆🏆 pic.twitter.com/r2Yo8kcfAX
— US Open Tennis (@usopen) September 6, 2025
‘ఈ సీజన్లో నేను ఆడిన ఫైనల్స్‌లో ఇదే చాలా కష్టమైనది. ఈసారి టైటిల్ గెలుపొందడానికి చాలా విషయాలను అధిగమించాలని అనుకున్నా. కష్టపడితే విజయం తథ్యమనే విషయం నాకు బాగా తెలుసు. ఈ సీజన్లో గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకోవడానికి నేను అర్హురాలిని. అందుకే.. మ్యాచ్ పాయింట్ సాధించగానే భావోద్వేగానికి లోనయ్యాను. ట్రోఫీని నిలబెట్టుకోవడంతో పాటు.. అద్భుతంగా ఆడడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. నా ఎమోషన్స్‌ను అదపులో ఉంచుకోవాలంటే టైటిల్ నెగ్గాలని భావించాను. అనుకున్నట్టే ఛాంపియన్ అయ్యాను. ప్రస్తుతం నన్ను చూసుకొని నేను చాలా గర్వపడుతున్నా’ అని వెల్లడించింది సబలెంకా. వింబుల్డన్ ఫైనల్లో ఇగా స్వియాటెక్ చేతిలో ఓడిన అమంద.. ఇప్పుడు సబలెంకా ధాటికి మరోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.