న్యూయార్క్: వరల్డ్ నంబర్‌వన్ అరీనా సబలెంకా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. శనివారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా 6-3, 7-6(7/3)తో అమెరికా నయా సంచలనం అమందా అనిసిమోవాపై అద్భుత విజయం సాధించింది. గంటన్నర పాటు హోరాహోరీగా సాగిన తుదిపోరులో సబలెంకాదే పైచేయి అయ్యింది.
వరుస విజయాలతో ఫైనల్లోకి దూసుకొచ్చిన ఎనిమిదో సీడ్ లోకల్ ప్లేయర్ అనిసిమోవాపై చెక్ పెడుతూ సబలెంకా వరుసగా రెండోసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. తద్వారా అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్(2014) తర్వాత రెండు టైటిళ్లు అందుకున్న ప్లేయర్‌గా ఈ బెలారస్ బ్యూటీ నిలిచింది. మ్యాచ్ మొత్తంలో టాప్‌సీడ్ సబలెంకా ఒక ఏస్ కొడితే అనిసిమోవా నాలుగు ఏస్‌లతో ఆకట్టుకుంది.
అయితే డబుల్ ఫాల్ట్స్ సబలెంకా రెండు సార్లు చేస్తే అనిసిమోవా ఏడుసార్లు తప్పిదం చేసింది. ఆరింటిలో ఐదు బ్రేక్ పాయింట్లను సబలెంకా కాపాడుకుంటే ఏడింటిలోఅనిసిమోవా నాలుగింటికే పరిమితమైంది. సబలెంకా 13 విన్నర్లు కొడితే.. అమెరికా యువ ప్లేయర్ 22 కొట్టినా లాభం లేకపోయింది. సబలెంకా 15సార్లు అనవసర తప్పిదాలు చేస్తే..29 సార్లు చేసిన అనిసిమోవా మూల్యం చెల్లించుకుంది. టాప్‌సీడ్ మొత్తంగా 76 పాయింట్లు ఖాతాలో వేసుకుంటే అనిసిమోవా 59 పాయింట్లతో సరిపెట్టుకుంది. ఇలా రెండు సెట్ల పోరు అభిమానులను ఆకట్టుకుంది.
హోరాహోరీగా:
టోర్నీ టైటిల్ ఫెవరెట్లలో ఒకరిగా బరిలోకి దిగిన సబలెంకా అంచనాలకు అనుగుణంగా రాణించింది. మరోవైపు అసలు అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అనిసిమోవా అనూహ్య విజయాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫైనల్లో సబలెంకా, అనిసిమోవా మధ్య పోరు నువ్వానేనా అన్నట్లు తలపించింది. తొలి సెట్‌ను సబలెంకా 6-3తో కైవసం చేసుకుంది. అనిసిమోవా తొలి సర్వీస్‌ను బ్రేక్ చేసిన సబలెంకా 2-0 ఆధిక్యం కనబరిచింది. మూడో గేమ్‌లోనూ 30-0తో ఆధిక్యంలో నిలువడంతో అంతా అనిసిమోవా పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఒక్కసారిగా పుంజుకున్న అనిసిమోవా గేమ్ గెలిచి ఆశ్చర్యపరిచింది.
ఈ క్రమంలో 3-2 ఆధిక్యంలోకి వెళ్లింది. తన అనుభవాన్ని ఉపయోగిస్తూ సబలెంకా వరుసగా నాలుగు గేములు గెలిచి..తొమ్మిదో గేమ్‌లో అనిసిమోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి 38 నిమిషాల్లోనే తొలి సెట్‌ను ఖాతాలో వేసుకుంది. రెండో సెట్లోనూ ఇద్దరు దూకుడుగా ఆడారు. అయితే 5-4 ఆధిక్యంతో సబలెంకా చాంపియన్‌షిప్ సర్వీస్ చేస్తున్న సమయంలో అతి సులువైన ఓవర్‌హెడ్ స్మాష్‌ను విడిచిపెట్టుకుంది. దీంతో సెట్ టేబ్రేక్కు దారితీసింది. ఇక్కడా పొరపాటుకు అవకాశమివ్వని సబలెంకా ప్రశాంతంగా పని కానిచ్చింది.
4 సబలెంకకు ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్. అన్నీ హార్డ్కోర్ట్పైనే గెలిచినవే.
ప్రైజ్‌మనీ
విజేత: సబలెంకా రూ.44.08 కోట్లు
రన్నరప్: అనిసిమోవా రూ.22.04 కోట్లు