సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. హుసేన్సాగర్ వేదికగా ఫిబ్రవరి 11న జరుగనున్న ఈ అంతర్జాతీయ ఈవెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ట్రాక్‌పై జాతీయ స్థాయిలో ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్) పోటీలు రెండు దఫాలుగా విజయవంతమయ్యాయి.
తాజాగా అంతర్జాతీయ స్థాయి ఫార్ములా-ఈ రేసింగ్ పోటీలకు అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం, నిర్వాహకులు కలిసి ఏర్పాటు చేస్తున్నారు. 2.8 కి.మీ మేర ఉన్న హైదరాబాద్ సర్క్యూట్లోఅడుగడుగునా భద్రతా పరంగా ప్రత్యేకంగా భారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. పోటీలను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకుల కోసం గ్యాలరీలను నిర్మిస్తున్నారు. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ ట్రాక్ చుట్టూ మొత్తం 10 చోట్ల సుమారు 25 వేల మంది కూర్చునేలా వేదికలను నిర్మించనున్నారు.