ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెండ్లి సందడి మొదలైంది. సచిన్ కుమారుడు, ఔత్సాహిక క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. 25 ఏండ్ల అర్జున్.. ముంబైలో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో సానియా చందోక్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్టు తెలుస్తున్నది. సానియా.. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలు. రవి కుమారుడు గౌరవ్ ఘాయ్ కూతురే సానియా. కాగా వీరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించి అటు సచిన్ కుటుంబం నుంచి గానీ ఇటు ఘాయ్ కుటుంబం నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. కెరీర్ ఆరంభంలో ముంబై రంజీ జట్టుకు ఆడిన అర్జున్.. ప్రస్తుతం గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన అతడు.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున పలు మ్యాచ్‌లు ఆడినా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దేశవాళీ క్రికెట్ (రెడ్ బాల్ ఫార్మాట్)లో 17 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 37 వికెట్లు తీసి 532 పరుగులు చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్లోనూ 17 మ్యాచ్‌లు ఆడినా ఆ ఫార్మాట్లో ఆకట్టుకోలేకపోతున్నాడు.
ఎవరీ సానియా..?
ముంబైలో పుట్టిపెరిగిన సానియా.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యూయేషన్ పూర్తిచేసి ప్రముఖ పెట్ కేర్ బ్రాండ్ అయిన మిస్టర్ పాస్ పెట్ స్పా అండ్ స్టోర్ ఎల్ఎల్పీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నది. ఈ సంస్థకు ఆమె సహ వ్యవస్థాపకురాలిగా ఉంది. ముంబై వ్యాపారరంగంలో రవి ఘాయ్ కుటుంబానికి ఘనమైన చరిత్రే ఉంది. గ్రావిస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఫుడ్, హాస్పిటాలిటీ రంగాల్లో ఘాయ్ కుటుంబానికి పెట్టుబడులున్నాయి. ఈ గ్రూప్ బాస్కిన్-రాబిన్స్ ఇండియా, బ్రూక్లిన్ క్రీమరీ ఐస్‌క్రీమ్ లాంటి బ్రాండ్లను నిర్వహిస్తున్నది. ఈ కంపెనీ కార్యక్రమాల్లోనూ సానియా చురుకుగా పాల్గొంటుంది. ఒక నివేదిక ప్రకారం గ్రావిస్ ఫుడ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 624 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతేగాక ముంబై లోని ఇంటర్ కాంటినెంటల్ హోటల్ సైతం ఈ కుటుంబానిదే.