Arjun Tendulkar | భారత క్రికెట్ లెజెండ్, మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తాజాగా నిశ్చితార్థం చేసుకున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో అర్జున్ నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై టెండూల్కర్ కుటుంబం లేదా ఘాయ్ కుటుంబం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. రెండు కుటుంబాల సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో అర్జున్, సానియా చందోక్ ఉంగరాలు మార్చుకున్నట్టు ఓ ప్రముఖ పత్రిక రాసుకొచ్చింది.
అర్జున్, సానియా ఎంగేజ్మెంట్కి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయినట్టు తెలుస్తుంది. అర్జున్‌తో సానియా నిశ్చితార్థం జరిగిందని తెలిసి అందరు ఆమె ఎవరనే ఆరాలు తీస్తున్నారు. సానియా చందోక్ ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందినవారు కాగా, ఆమె Mr. Paws Pet Spa & Store LLP లో డిజిగ్నేటెడ్ పార్టనర్‌గా, డైరెక్టర్‌గా ఉన్నారు. ఘాయ్ కుటుంబం హాస్పిటాలిటీ, ఫుడ్ ఇండస్ట్రీల్లో ప్రసిద్ధి చెందింది. వారు Inter Continental హోటల్‌తో పాటు ప్రసిద్ధ ఐస్‌క్రీమ్ బ్రాండ్ Brooklyn Creamery ను కూడా నిర్వహిస్తున్నారు. పబ్లిక్‌కి దూరంగా ఉండడాన్నే సానియా ఇష్టపడతారని సమాచారం.
ఇక అర్జున్ టెండూల్కర్ విషయానికి వస్తే తన ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్‌ను 2020/21 దేశీయ సీజన్లో ముంబై తరఫున హర్యానాతో జరిగిన టి20 మ్యాచ్‌తో ప్రారంభించాడు. ఆ తర్వాత అవకాశాల కోసం 2022/23 సీజన్లో గోవా జట్టుకు మారాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 17 మ్యాచ్‌లు,532 పరుగులు ,1 సెంచరీ ,2 హాఫ్ సెంచరీలు , 37 వికెట్లు, ఒకసారి ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన అర్జున్.. 73 బంతులు వేసి 3 వికెట్లు తీసాడు. బౌలింగ్ అత్యుత్తమ గణాంకం 1/9 గా నమోదు చేశాడు. ఎకానమీ రేట్ 9.36 కాగా, స్ట్రైక్ రేట్ 24.3. బ్యాటింగ్‌లో తొమ్మిది బంతుల్లో 13 పరుగులు చేసి, 144.44 స్ట్రైక్ రేట్ సాధించాడు. ఆయన అత్యధిక స్కోరు 13 పరుగులు మాత్రమే. అయితే తండ్రి సచిన్ లాగే అర్జున్ కూడా క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేయాలని కృషి చేస్తున్నాడు.