చెన్నై : ప్రతిష్టాత్మక చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేసి అర్జున్ హవా కొనసాగుతున్నది. శనివారం జరిగిన మూడో రౌండ్ పోరులో ప్రపంచ ఐదో ర్యాంకర్ అర్జున్..అమెరికా గ్రాండ్‌మాస్టర్ రే రాబ్సన్పై అద్భుత విజయం సాధించాడు. తద్వారా మాస్టర్స్ కేటగిరీలో అర్జున్ 2.5 పాయింట్లతో రెండో స్థానంలోకి దూసుకెళ్లాడు. ఆది నుంచే తనదైన ఆధిక్యం ప్రదర్శించిన ఈ తెలంగాణ జీఎం ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా పైచేయి సాధించాడు. మరో ఆరు రౌండ్లు మిగిలి ఉన్న రౌండ్ రాబిన్ లీగ్ పోటీలో ప్రస్తుతం జర్మనీకి చెందిన విన్సెంట్ కెమర్..భారత ప్లేయర్ కార్తీకేయన్ మురళీపై అలవోక విజయం సాధించాడు. హ్యాట్రిక్ గెలుపు ఖాతాలో వేసుకున్న కెమర్ ప్రస్తుతం మూడు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
టోర్నీలో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని కెమర్ ఇదే జోరు కొనసాగిస్తే తిరుగుండకపోవచ్చు. మిగతా గేముల్లో అవోండర్ లియాంగ్..జోర్డాన్ వాన్ ఫారెస్ట్‌పై, విదిత్ గుజరాతి..నిహాల్ సరిన్పై విజయాలతో ముందంజ వేశారు. చాలెంజర్స్ విభాగంలో హర్షవర్ధన్‌పై విజయంతో అభిమన్యు పురాణిక్(2.5) టాప్‌లో కొనసాగుతున్నాడు. ప్రాణేశ్..ఇనియాన్పై, లియోన్ లూక్ మెండోకా..వైశాలి రమేశ్‌బాబుపై గెలిచారు. హారిక- అధిబన్ భాస్కరన్, ఆర్యన్చోప్రా-దిప్తియాన్ ఘోష్ మధ్య గేములు డ్రాగా ముగిశాయి. చాలెంజర్స్ విభాగంలో 2.5 పాయింట్లతో ప్రాణేశ్, అభిమన్యు ఆధిక్యంలో ఉన్నారు.