Paris Olympics : విశ్వ క్రీడల్లో పతకం సాధిస్తే అథ్లెట్లు ప్రపంచాన్ని గెలిచినంత సంతోషిస్తారు. ఇక అదే వేదికపై జీవిత భాగస్వామి కూడా దొరికిందంటే వాళ్ల సంతోషం వెయ్యి రెట్లు అవుతుంది. తాజాగా ఓ ప్రేమజంట ఒలింపిక్ విలేజ్(Olympic Village)లో తమ జీవితంలోని స్పెషల్ డేను సెలబ్రేట్ చేసుకుంది. తమ దేశానికి చెందిన అథ్లెట్ల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుంది. దాంతో, ఈ మెగా టోర్నీలో ప్రపోజ్ చేసుకున్న తొలి జోడీగా వార్తల్లో నిలిచింది.
ఇంతకూ ఆ లవ్ బర్డ్స్ ఎవరంటే..? అర్జెంటీనా బృందంలోని పబ్‌లో సిమొనెట్(Pablo Simonet), పిలర్ కంపోయ్(Pilar Compoy). వీళ్లిద్దరూ ఇంతకంటే మంచి ముహూర్తం లేదనుకున్నట్టున్నారు. ఎంచక్కా ఒలింపిక్ విలేజ్‌లోనే తమ లవ్ జర్నీని మరో మెట్టు ఎక్కించింది. శుక్రవారం సహచరుల సమక్షంలో నిరాడంబరంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ ఫొటోలను ఒలింపిక్స్ నిర్వాహకులు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు.
పారిస్ ఒలింపిక్స్‌లో ఇదే మొదటి నిశ్చితార్ధం. అర్జెంటీనా హ్యాండ్ బాల్, హాకీ ఆటగాళ్ల సమక్షంలో పబ్‌లో సిమొనెట్, పిలర్ కంపొయ్లు ప్రత్యేకమైన క్షణాలను జ్ఞాపకంగా మలుచుకున్నారు. మీ ఇద్దరికీ అభినందనలు. ఆల్ ది బెస్ట్ అని ఒలింపిక్స్ ఇన్‌స్టా పోస్ట్‌లో కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలిపింది.
పబ్‌లో, పిలర్లు 2015 నుంచి డేటింగ్లో ఉన్నారు. 9 ఏండ్ల తమ ప్రేమ ప్రయాణాన్నిఒలింపిక్స్ వేదికగా బహిర్గంతం చేస్తూ.. పెండ్లితో ఒక్కటవ్వాలనుకున్నారు. ముందుగా పబ్‌లో మోకాలిపై కూర్చొని పిలర్కు ప్రపోజ్ చేశాడు. ఇంకేముంది పిలర్ సంతోషంగా ఓకే చెప్పేసింది. వెంటనే మనోడు ఉంగరం పెట్టేసి ఎంగేజ్మెంట్ తంతు ముగించాడు. అనంతరం తమ జట్టు సభ్యులతో కలిసి ఇద్దరూ గ్రూప్ ఫొటో దిగారు.
