ఐపీఎల్ ప్రారంభానికి ముందే మరో స్టార్ ఆటగాడు ఒక ఇంటి వాడయ్యాడు. ఇటీవలే ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ తన ప్రేయసిని మనువాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు న్యూజిల్యాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌతీ కూడా అదే బాటలో నడిచాడు. ఈసారి కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్ బరిలో దిగుతున్న టిమ్ సౌతీ.. చాలాకాలంగా ప్రేమిస్తున్న బ్రయాను పెళ్లి చేసుకున్నాడు.
తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడీ వెటరన్ పేసర్. చాలాకాలంగా రిలేషన్లో ఉన్న ఈ జంటకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ కొత్త దంపతులకు 2017లో ఇండీ మే సౌతీ, 2019లో స్లోయానే అవా సౌతీ జన్మించారు. ఇప్పుడు సౌతీ, బ్రయా జంట తమ రిలేషన్లో మరో అడుగు ముందుకేసి పెళ్లి చేసుకుంది.
ఈ ఫొటోలు షేర్ చేస్తూ ‘‘ఫరెవర్’’ (ఎప్పటికీ) అని సౌతీ పోస్టు పెట్టాడు. వీటిని చూసిన అభిమానులు, క్రికెటర్లు ఈ దంపతులపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.