SMAT 2023: దేశవాళీ క్రికెట్లో భాగంగా గత నెల రోజులుగా సాగుతున్న సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)ని పంజాబ్ కైవసం చేసుకుంది. సోమవారం మొహాలీ వేదికగా బరోడాతో ముగిసిన ఫైనల్ పోరులో పంజాబ్.. 20 పరుగుల తేడాతో గెలిచి తొలిసారిగా స్మాట్ టైటిల్ గెలిచింది. పంజాబ్ నిర్దేశించిన 223 పరుగుల ఛేదనలో బరోడా.. 203 పరుగులకే పరిమితమైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బరోడా.. పంజాబ్‌కు బ్యాటింగ్ అప్పగించింది. పంజాబ్ బ్యాటర్లలో అన్మోల్ప్రీత్ సింగ్ (61 బంతుల్లో 113, 10 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరవిహారానికి తోడు ఐపీఎల్లో ముంబై తరఫున ఆడే నెహల్ వధేరా (27 బంతుల్లో 61 నాటౌట్, 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనలో బరోడా కూడా ధీటుగానే బదులిచ్చింది. అభిమన్యు సింగ్ (42 బంతుల్లో 61, 3ఫోర్లు, 4 సిక్సర్లు), నినాద్ రత్వ (22 బంతుల్లో 47, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) తో పాటు కెప్టెన్ కృనాల్ పాండ్యా (32 బంతుల్లో 45, 3 ఫోర్లు, 1 సిక్సర్) లు రాణించారు. విష్ణు సోలంకి 11 బంతుల్లోనే 3 బౌండరీలు, 2 భారీ సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేసి బరోడా విజయం మీద ఆశలు కల్పించాడు. కానీ పంజాబ్ బౌలర్లు ఆఖర్లో బరోడా బ్యాటర్లను కట్టడి చేసి తమ జట్టుకు విజయాన్ని అందించారు.
PUNJAB ARE THE CHAMPIONS OF SYED MUSHTAQ ALI 2023….!!!!
– This is the first time Punjab has won the title, history created at Mohali pic.twitter.com/szl0kFNWct
— Johns. (@CricCrazyJohns) November 6, 2023
పంజాబ్ గతంలో నాలుగు సార్లు ఫైనల్‌కు చేరినా ఆఖరి మెట్టు మీద బోల్తా కొట్టింది. 2006, 2011, 2012, 2014లో ఆ జట్టు ఫైనల్‌కు చేరినా రన్నరప్‌గానే నిలిచింది. కానీ తాజా టోర్నీలో మాత్రం నిలకడగా విజయాలు సాధిస్తూ ఫైనల్లో గెలిచి తొలి టైటిల్‌ను గెలుచుకుంది.