The Raaja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తోంది. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం నిన్న (జనవరి 9) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై తొలిరోజే భారీ కలెక్షన్లను రాబట్టింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా అన్ని భాషల్లో కలిపి సుమారు రూ.90 కోట్ల నెట్ వసూళ్లను సాధించినట్లు తెలుస్తుంది. ఇందులో గురువారం నిర్వహించిన పెయిడ్ ప్రివ్యూల ద్వారా రూ.9.15 కోట్లు రాగా, శుక్రవారం ఒక్కరోజే రూ.45 కోట్ల నెట్ వసూళ్లు నమోదయ్యాయని సమాచారం.
ఈ సినిమా ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో తన విశ్వరూపాన్ని చూపించింది. కేవలం తెలుగు వెర్షన్ నుండే దాదాపు రూ.47.4 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 57 శాతానికి పైగా ఆక్యుపెన్సీ కనిపించింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో రూ.17 కోట్ల షేర్‌ను వసూలు చేసి ప్రభాస్ తన బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించుకున్నారు. ఉత్తరాదిలో కూడా ఈ చిత్రం సత్తా చాటుతూ హిందీ బెల్ట్‌లో రూ.6.15 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇతర భాషలైన తమిళం, కన్నడ మరియు మలయాళంలో కలిపి సుమారు రూ.60 లక్షల వరకు వసూలైంది. ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం రూ.20 నుంచి రూ.30 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తుంది. మొదట ఈ చిత్రానికి మిశ్రమ రివ్యూలు వచ్చినప్పటికీ, ప్రభాస్ క్రేజ్ మరియు మారుతి మార్క్ కామెడీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. ఒక హారర్ కామెడీ చిత్రానికి భారతీయ సినీ చరిత్రలో ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం విశేషం. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. లాంగ్ వీకెండ్ కావడంతో వచ్చే రెండు రోజుల్లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.