ప్రయాగ్‌రాజ్ : ఇవాళ మాఘ పౌర్ణమి. దీంతో ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్(Maha Kumbh)లో భక్తులు కోట్ల సంఖ్యలో అమృత స్నానాలు ఆచరిస్తున్నారు. ఇవాళ ఉదయం భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కూడా పుణ్య స్నానం చేశారు. ఆయన తన సతీమణితో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. అమృత స్నానంకు చెందిన ఫోటోను తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు కుంబ్లే.
Blessed 🙏🏽#MahaKumbh #Prayagraj pic.twitter.com/OFY6T3yF5F
— Anil Kumble (@anilkumble1074) February 12, 2025
త్రివేణి సంగమం ఇవాళ కిక్కిరిసిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఉదయం 10 గంటల వరకే కోటిన్నర మంది పుణ్య స్నానం చేశారు. ఇక నదీ స్నానం కోసం వస్తున్న భక్తుల సంఖ్య అధికంగా ఉన్నది. దాదాపు 10 కిలోమీటర్ల దూరం వరకు భక్తుల రద్దీ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులపై ఇవాళ ఉదయం అధికారులు 25 క్వింటాళ్ల పువ్వులు కురిపించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. ప్రయాగ్‌రాజ్‌లోని వార్‌రూం నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
సుమారు మూడు కోట్ల మంది ఇవాళ మహాకుంభ్‌లో స్నానాలు చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. జనం రద్దీ పెరగడంతో ట్రాఫిక్ ప్లాన్‌ను మార్చేశారు. నగరంలోకి వాహనాల ఎంట్రీని నిషేధించారు. మేళా ప్రదేశానికి ఎటువంటి వాహనాన్ని అనుమతించడంలేదు. వాహనాల పార్కింగ్ స్థలం నుంచి ఘాట్ల వరకు జనం నడిచి వెళ్తున్నారు.
సంగం వద్ద పారామిలిటరీ దళాలు పహారా కాస్తున్నాయి. స్నానాలు ముగించుకున్నవారిని అక్కడ నుంచి వెంటనే పంపిస్తున్నారు. రద్దీని కంట్రోల్ చేసేందుకు భారీ సంఖ్యలో ప్రభుత్వ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. 15 జిల్లాల డీఎంలు, 20 మంది ఐఏఎస్‌లు, 85 మంది పీసీఎస్ ఆఫీసర్లు రంగంలోకి దిగారు.