Ishan Kishan |ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత జట్టుతో వెళ్లి సిరీస్ మధ్యలోనే ఉన్నఫళంగా స్వదేశానికి వచ్చిన టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు అతడు ఆడతాడని భావించినా అతడు మాత్రం సెలక్షన్స్‌కు అందుబాటులో లేడు. జట్టులోకి రావాలంటే రంజీలు ఆడాలని టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ పదే పదే హెచ్చరించినా.. బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా పరోక్షంగా ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోలేదు. రెండు నెలలుగా మీడియాతో పాటు సోషల్ మీడియాకూ దూరంగా ఉంటున్న ఇషాన్ ఎట్టకేలకు దర్శనమిచ్చాడు.
వ్యక్తిగత కారణాలు చెప్పి దక్షిణాఫ్రికా పర్యటన నుంచి వచ్చిన ఇషాన్.. కొద్దిరోజులుగా బరోడాలోని కిరణ్ మోరే అకాడమీలో శిక్షణ పొందుతున్నాడని వార్తలు వచ్చాయి. ఇదే అకాడమీలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, అతడి సోదరుడు కృనాల్ పాండ్యాలు ట్రైనింగ్ అయ్యారు. సుమారు మూడు వారాలుగా అక్కడే ఉన్న ఇషాన్.. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా నోరు తెరవని అతడు తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేశాడు. వీడియోలో అతడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాతో కలిసి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇషాన్ కూడా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కే ఆడతాడన్న విషయం విదితమే.
డిసెంబర్లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడిన తర్వాత ఇషాన్ మళ్లీ బ్యాట్ పట్టలేదు. ఐపీఎల్ – 2024 కంటే ముందు అతడు డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్లో ఆడతాడని వార్తలు వస్తున్నాయి. అక్కడ్నుంచి నేరుగా ఐపీఎల్‌కు ఆడనున్నాడు. ఐపీఎల్ – 2024 షెడ్యూల్ విడుదలైన కొద్దిసేపటికే ఇషాన్.. ఇన్‌స్టాలో వీడియోను పోస్ట్ చేయడం గమనార్హం.