Wrestling Legend : విశ్వ క్రీడల్లో పసిడి పోరుకు అనర్హతకు గురైన భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ (Vinesh Phogat)కు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పలువురు ఒలింపిక్ రెజ్లింగ్ నియమాలపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా అమెరికా రెజ్లింగ్ దిగ్గజం జోర్డాన్ బరోజ్(Jordan Burroughs) సైతం వినేశ్‌కు మద్దతు పలికాడు. ఫైనల్ చేరిన వినేశ్‌కు కచ్చితంగా వెండి పతకం ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశాడు.
‘వినేశ్ ఫోగట్ సంఘటనతో అయినా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం కండ్లు తెరుస్తుందని అనుకుంటున్నా. రెజ్లింగ్‌లో ఆరుకంటే ఎక్కువ విభాగాలు ఉండాలి. ముగ్గురు ప్రపంచ స్థాయి రెజ్లర్లతో పోటీపడ్డాక.. గోల్డ్ మెడల్ కోసం రాత్రంతా ఏ అథ్లెట్ కూడా ఇలా కష్టపడొద్దు. ఈరోజు ఫైనల్ మ్యాచ్ కోసం వినేశ్ బరువు తగ్గడం కోసం భారత బృందం చేయని ప్రయత్నం లేదు’ అని జోర్డాన్ తెలిపాడు. అంతేకాదు ప్రపంచ రెజ్లింగ్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులను ఈ రెజ్లింగ్ లెజెండ్ సూచించాడు. అవేంటంటే..?
1. రెండో రోజు రెజ్లర్లకు బరువులో ఒక కిలో వరకూ మినహాయింపు ఇవ్వాలి.
2. ఉదయం 830 గంటల నుంచి 1030 మధ్య రెజ్లర్ల బరువును కొలవొద్దు.
3. భవిష్యత్‌లో జరిగే ఫైనల్లో ప్రత్యర్థి బరువు సరిగ్గా లేకుంటే వేటు వేయాలి.
4. సెమీఫైనల్ విజయం తర్వాత రెండో రోజు బరువులో తేడా ఉన్నా ఇద్దరు ఫైనలిస్టులకు మెడల్స్ ఇవ్వాలి. అయితే.. ఆయా విభాగానికి సరిపోయిన బరువు గల రెజ్లర్‌కే బంగారు పతకం ప్రకటించాలి.
మూడో ఒలింపిక్స్ ఆడుతున్న వినేశ్ ఫోగట్ ఈసారి 53 కిలోల బదులు 50 కిలోల విభాగంలో బరిలోకి దిగింది. తొలి బౌట్‌లోనే వరల్డ్ నంబర్ 1 లీ సుసానీకి చెక్ పెట్టిన వినేశ్.. ఆ తర్వాత ఉక్రెయిన్ రెజ్లర్ ఒక్సానా లివాచ్ (Oksana Livach)ను మట్టికరిపించింది. ఇక సెమీ ఫైనల్లోనూ ఉడుంపట్టుతో విజృంభించిన ఆమె క్యూబా రెజ్లర్‌ను 5-0తో చిత్తు చేసింది. దాంతో, ఫైనల్‌కు చేరిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా వినేశ్ రికార్డు నెలకొల్పింది.
ఇక ఫైనల్లో గోల్డ్ మెడల్‌తో దేశాన్ని గర్వించేలా చేయాలనుకున్న వినేశ్‌కు ఊహించని షాక్ తగిలింది. 50 కిలోల కంటే అదనంగా 100 గ్రాములు ఉందని నిర్వాహకులు ఆమెపై అనర్షత వేటు వేశారు. దాంతో, కోట్లాదిమంది ‘అదొక పీడకల అయి ఉంటే బాగుండు’ అంటూ సోషల్ మీడియాలతో తమ బాధను తెలియజేస్తున్నారు.