బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Mar 12, 2020 , 00:15:19

సింధు శుభారంభం

 సింధు శుభారంభం
  • తొలి రౌండ్లోనే శ్రీకాంత్‌ నిష్క్రమణ..
  • ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌

బర్మింగ్‌హామ్‌: ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఆరో సీడ్‌ సింధు 21-14, 21-17తేడాతో బివాన్‌ జెంగ్‌(అమెరికా)ను వరుస గేమ్‌ల్లో చిత్తుచేసింది. 42నిమిషాల పాటు మ్యాచ్‌ జరుగగా.. తొలి గేమ్‌లో కాసేపు హోరాహోరీ పోరు సాగింది. 8-9తో వెనుకబడిన సమయంలో ఒక్కసారిగా పుంజుకున్న సింధు వరుసగా ఐదుపాయింట్లు సాధించి దూకుడు కనబరిచింది. అదే ఆధిపత్యంతో గేమ్‌ సొంతం చేసుకుంది. రెండో గేమ్‌ సైతం ఉత్కంఠ భరితంగా సాగింది. జెంగ్‌  దూకుడుగా ఆడడంతో ఓ దశలో పాయింట్లు 16-16తో సమమయ్యాయి. ఆ తరుణంలో వరుస పాయింట్లతో దుమ్ములేపిన తెలుగమ్మాయి విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో కిడాంబి శ్రీకాంత్‌ 15-21, 16-21తేడాతో చెన్‌ లాంగ్‌(చైనా)చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. దీంతో ఒలింపిక్స్‌ అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి. మిక్స్‌డ్‌ డబుల్స్‌ పోటీలో  సిక్కిరెడ్డి - ప్రణవ్‌చోప్రా జోడీ 13-21, 21-11, 17-21తేడాతో టాప్‌ సీడ్‌ చైనా ద్వయం షీ వీజెంగ్‌, క్వింగ్‌ హువాంగ్‌ చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్‌లో గాయం కారణంగా ప్రత్యర్థి ద్వయం తప్పుకోవడంతో సిక్కిరెడ్డి, అశ్వినీ జోడి ప్రి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. 


logo