హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిభకు పట్టుదల తోడైతే అద్భుతాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు ఈ చిచ్చర పిడుగులు. తాము ఎంచుకున్న ఆటలో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్న ఆకాంక్షతో ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన అక్షయరెడ్డి, అన్విత్ బరిలోకి దిగిన ప్రతీ టోర్నీలో పతకాలతో సత్తాచాటుతూ ఔరా అనిపించుకుంటున్నారు. ఇటీవల కొచ్చి(కేరళ) వేదికగా జరిగిన సీఐఎస్సీఈ ఆర్చరీ జాతీయ టోర్నీలో అక్షయరెడ్డి బాలికల అండర్-14 విభాగంలో స్వర్ణం సహా ఓవరాల్‌గా రజతం దక్కించుకుంది. ప్రస్తుతం బండి స్వామి, గంగరాజు దగ్గర శిక్షణ తీసుకుంటున్న అక్షయ 8 ఏండ్ల వయసులోనే ఆర్చరీ కెరీర్ మొదలుపెట్టింది. ఆరు టోర్నీల్లో తనదైన ప్రతిభ కనబరుస్తూ టాప్-3లో నిలిచి ఆకట్టుకుంది. మరోవైపు అన్విత్ పిట్ట కొంచెం కూత ఘనమని నిరూపిస్తున్నాడు. డెహ్రాడూన్‌లో జరిగిన ఏషియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్స్పీడ్ స్కేటింగ్‌లో 11 ఏండ్ల అన్విత్..రజతం (333మీ), కాంస్యం (500మీ)తో అదరగొట్టాడు. స్కేటింగ్‌లో రివ్వున దూసుకెళుతున్న అన్విత్ ఏనిమిదేండ్ల ప్రాయంలోనే రింక్‌లో అడుగుపెట్టాడు. నిరంతర సాధనతో అంచలంచెలుగా రాణిస్తూ ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయ టోర్నీల్లో 40కి పైగా పతకాలు కొల్లగొట్టి భవిష్యత్ ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు.