IPL | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గత ఎడిషన్‌లో పదేండ్ల విరామం తర్వాత టైటిల్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తాజా సీజన్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. 2024 సీజన్ ఆరంభానికి ముందు అసలు అంచనాలే లేకుండా బరిలో నిలిచిన కోల్‌కతా… టోర్నీ ఆసాంతం ఊపు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను క్వాలిఫయర్-1తో పాటు ఫైనల్లోనూ చిత్తు చేసి మూడో టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. 2025లోనూ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు డిఫెండింగ్ చాంపియన్స్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా ఈసారి ఆ జట్టుకు పెను సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. దశాబ్ది విరామం అనంతరం తమకు ట్రోఫీని అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను సైతం పక్కనబెట్టి అతడిని వేలానికి వదిలేసిన కేకేఆర్ యాజమాన్యం.. ఈ ఫార్మాట్లో గొప్ప రికార్డేమీ లేని అజింక్యా రహానేకు ఆ బాధ్యతలు అప్పగించింది. మరి అజింక్యా.. అయ్యర్‌ను మరిపిస్తాడా అన్నది చూడాలి.
శ్రేయస్‌ను కాదనుకున్న కేకేఆర్ యాజమాన్యం.. వేలంలో మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను రూ. 23.75 కోట్ల భారీ ధరతో దక్కించుకోవడంతో అతడికే సారథ్య పగ్గాలు అప్పజెప్పుతారని అంతా భావించారు. కానీ టీమ్ మేనేజ్మెంట్ అనూహ్యంగా రహానేను ఆ స్థానంలో నియమించి వెంకటేశ్‌ను అతడి డిప్యూటీగా ఎంపిక చేసింది. ఈ ద్వయం కేకేఆర్ జైత్రయాత్రను ఏ మేరకు ముందుకు తీసుకెళ్తుందనేది ఆసక్తికరం. ఐపీఎల్లో చాలాకాలంగా ఆడుతున్నప్పటికీ రహానే.. రంజీలు, ఇతర దేశవాళీ టోర్నీల మాదిరిగా ఈ లీగ్‌లో తనదైన ముద్రను వేయలేకపోయాడు. కానీ గతేడాది ముగిసిన సయ్యిద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో టోర్నీ టాప్ స్కోరర్ (469)గా నిలిచాడు. అతడి బ్యాటింగ్ సగటు కూడా 164.56తో మెరుగ్గానే ఉంది. గత రెండు ఐపీఎల్ సీజన్లలోనూ అతడు మెరుపులు మెరిపించాడు. బ్యాట్‌తో పాటు మైదానంలో సారథిగానూ తన వ్యూహాలతో రహానే సక్సెస్ అయితే ఆ జట్టుకు తిరుగుండదు. 2021 నుంచి కోల్‌కతాకు ఆడుతూ గత సీజన్లో 46 సగటుతో 370 పరుగులు చేసిన వెంకటేశ్ మిడిలార్డర్లో అత్యంత కీలకం. తనదైన రోజున అతడి విధ్వంసం ఎవరూ ఊహించని స్థాయిలో ఉంటుంది. మిడిలార్డర్‌తో పాటు లోయరార్డర్లో దుర్బేధ్యమైన లైనప్ కేకేఆర్ సొంతం. సిక్సర్ల రింకూ సింగ్, హార్డ్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్, బంతిని నేలమీద కంటే గాల్లోనే ఎక్కువ ఉంచే మన్దీప్ సింగ్ వంటి నాణ్యమైన ఫినిషర్లు కోల్‌కతాకు ఉన్నారు. ఇక భారత చాంపియన్స్ ట్రోఫీలో కీలకపాత్ర పోషించిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నైట్‌రైడర్స్‌కు వెలకట్టలేని ఆస్తి. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్‌కు సహకరించే ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై అతడు అత్యంత ప్రమాదకారి. నరైన్‌కు అండగా వరుణ్ మ్యాజిక్ చేస్తే ప్రత్యర్థులకు చుక్కలే.
బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తున్నా.. నిరుటి సీజన్లో ఓపెనర్‌గా ప్రమోట్ అయి సంచలనాలు సృష్టించిన విండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ కొంతకాలంగా ఫామ్‌లేమితో తంటాలు పడుతున్నాడు. కొద్దిరోజుల క్రితం ముగిసిన ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో అతడు బ్యాట్‌తో పాటు బంతితోనూ విఫలమయ్యాడు. ఫిల్ సాల్ట్‌ను వదులుకోవడం కేకేఆర్‌కు ఎదురుదెబ్బ. సాల్ట్ లేకపోవడంతో నరైన్‌కు ఓపెనింగ్గా గుర్బాజ్, డికాక్‌లో ఎవరు ఆడతారనేది చూడాలి. అన్నింటికీ మించి నిఖార్సైన పేసర్ లేకపోవడం ఆ జట్టుకు భారీ లోటు. స్టార్క్‌ను వేలానికి వదిలేసిన కోల్‌కతా.. దక్షిణాఫ్రికా పేసర్ ఆన్రిచ్ నోకియాను దక్కించుకున్నా తరుచూ గాయాల బారిన పడే అతడి ఫిట్‌నెస్‌పై అనుమానాలున్నాయి. దీంతో ఆ జట్టు పేస్ భారం అంతగా అనుభవం లేని హర్షిత్ రాణాపై పడనుంది. ఆసీస్ సీమర్ స్పెన్సర్ జాన్సన్ రూపంలో ఓ పేసర్ ఉన్నప్పటికీ అతడికి తుది జట్టులో చోటు దక్కుతుందా? అన్నది అనుమానమే.
ఐపీఎల్లో తొలిసారి 2012లో టైటిల్ గెలిచిన కోల్‌కతా.. 2014లో రెండోసారి విజేతగా నిలిచింది. ఈ రెండుసార్లూ ఆ జట్టుకు గౌతం గంభీరే సారథి. ఇక నిరుడు మూడోసారి విజేతగా నిలిచినప్పుడు గంభీర్ మెంటార్‌గా కీలకపాత్ర పోషించాడు. కానీ అతడు భారత జట్టుకు హెడ్‌కోచ్‌గా నియమితుడవడంతో ఆ బాధ్యతలను విండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావోకు అప్పగించారు. ఆటగాడిగా అద్భుతమైన రికార్డు కలిగిన బ్రావో.. గంభీర్‌ను ఏ మేరకు మరిపిస్తాడు? అనేది చూడాలి. చీఫ్ కోచ్ చంద్రకాంత్ పాటిల్ కఠినమైన శిక్షణ, అసిస్టెంట్ కోచ్‌గా వెస్టిండీస్ ఆల్‌రౌండర్ గిబ్సన్.. ఆ జట్టు టైటిల్ నిలబెట్టుకునే దిశగా ఏ మేరకు సఫలీకృతం అవుతుందో చూడాలి.