దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే చేసిన ఒక పని క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొంతకాలంగా ఫామ్ లేమితో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న రహానే.. అసలు సౌతాఫ్రికా టూర్కు సెలెక్ట్ అవుతాడా? అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే అతన్ని ఎంపిక చేసిన సెలెక్టర్లు టెస్టుల్లో వైస్ కెప్టెన్ హోదా నుంచి అతన్ని తప్పించారు.
అదే సమయంలో న్యూజిల్యాండ్ సిరీస్లో శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా రాణించడం, సౌతాఫ్రికాలో పర్యటించిన ఇండియా ఎ జట్టులో హనుమ విహారి కూడా రాణించడంతో రహానేకు తుది జట్టులో స్థానం దక్కడం అసంభవమే అని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా కోహ్లీ, ద్రవిడ్ మాత్రం శ్రేయాస్, విహారిని పక్కనపెట్టి.. రహానేకు ఛాన్స్ ఇచ్చారు.
ఒక విధంగా ఇదే రహానేకు చివరి అవకాశం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతున్న రహానే.. తొలి టెస్టు తొలి రోజు మంచి ఆటతీరు కనబరిచాడు. ఈ సమయంలో బ్యాటింగ్ చేస్తూ బౌలర్ బంతిని విసిరే ప్రతిసారీ ‘వాచ్ ది బాల్’ (బంతిని చూడు) అని తనకు తను చెప్పుకుంటూ కనిపించాడు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కొన్నిసార్లు క్రికెట్ ఇలాంటి సీనియర్ ఆటగాళ్ల విషయంలో ఎంత క్రూరంగా ఉంటుందో అర్థమవుతోందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
Rahane reminding himself to watch the ball as the bowler runs up makes me realise how cruel cricket can be for such experienced guy pic.twitter.com/3HKhVgMMFc
— Nikhil Dubey (@nikhildubey96) December 26, 2021