ఢిల్లీ: ఫిఫా వరల్డ్ కప్-2026 క్వాలిఫికేషన్ ఆసియా జోన్లో మూడో రౌండ్‌కు ముందంజ వేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఓడగా.. ఈ మ్యాచ్‌లో ఖతార్ చేసిన వివాదాస్పద గోల్‌పై ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్).. ఫిఫాతో పాటు ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ)కు లేఖ రాసింది.
మంగళవారం రాత్రి ఖతార్‌తో జరిగిన మ్యాచ్ 72వ నిమిషంలో ఆ జట్టు ఆటగాడు యూసెఫ్ ఐమెన్ చేసిన గోల్ వివాదాస్పదమైంది. గోల్ లైన్ అవతల పడ్డ బంతిని అందుకున్న యూసుఫ్ గోల్ కొట్టినా రిఫరీ మాత్రం దానిని సరైనదిగానే గుర్తించడంతో వివాదం రాజుకుంది. దీనిపై ఏఐఎఫ్ఎఫ్ స్పందిస్తూ.. ‘ఖతార్‌తో మ్యాచ్ ఓడటం భారత ఫుట్‌బాల్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఆటలో గెలుపోటములు సహజం. కానీ క్రీడా స్ఫూర్తి చాలా ముఖ్యం. మాకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపించాలని కోరుతున్నాం’ అని లేఖలో పేర్కొంది.