అబుదాబి: పొట్టి క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ అస్గర్కు.. అఫ్గానిస్థాన్ జట్టు ఘనంగా వీడ్కోలు పలికింది. గత మ్యాచ్లో పాకిస్థాన్ చేతిలో ఓటమితో కలత చెందిన అఫ్గానిస్థాన్ మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ ఆదివారం అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించగా.. సూపర్-12లో భాగంగా జరిగిన పోరులో నబీ సేన 62 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. బ్యాటర్ల సమిష్టి ప్రదర్శనతో మంచి స్కోరు చేసిన అఫ్గాన్.. ఆ తర్వాత ప్రత్యర్థిని తమ బౌలింగ్ దాడితో ఉక్కిరి బిక్కిరి చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. మహమ్మద్ షహజాద్ (45) టాప్ స్కోరర్ కాగా.. హజ్రతుల్లా (33), అస్గర్ అఫ్గాన్ (31), కెప్టెన్ మహమ్మద్ నబీ (32 నాటౌట్) రాణించారు. నమీబియా బౌలర్లలో నికోల్, రూబెన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. డేవిడ్ వైస్ (26) టాప్ స్కోరర్. అఫ్గాన్ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ నవీన్, హమీద్ హుసేన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.
సంక్షిప్త స్కోర్లు
అఫ్గానిస్థాన్: 20 ఓవర్లలో 160/5 (షహజాద్ 45, అస్గర్ 31; నికోల్ 2/21), నమీబియా: 20 ఓవర్లలో 98/9 (వైస్ 26; హమీద్ 3/9, నవీన్ 3/26).