ముంబై : టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెటర్ ఎంఎస్ ధోనీ(MS Dhoni)ని.. మిస్టర్ కూల్ అని సంబోధిస్తున్న విషయం తెలిసిందే. మైదానంలో ఉన్న సమయంలో అతన్ని కెప్టెన్ కూల్‌గా కూడా పిలిచేవాళ్లు. అయితే ఇప్పుడు కెప్టెన్ కూల్ అన్న ట్యాగ్ ట్రేడ్‌మార్క్ కోసం ధోనీ దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ పదాన్ని తానే వాడుకునే రీతిలో అతను ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ పోర్టల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఉత్కంఠ రేపే మ్యాచ్‌లోనూ ధోనీ చాలా కూల్‌గా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించేవాడు. అతని సారధ్య బాధ్యతలు చూసిన క్రికెటర్లు, అభిమానులు అతన్ని మిస్టర్ కూల్ అని, కెప్టెన్ కూల్ అని పిలిచేవాళ్లు. ఇప్పుడు ఆ పదాన్నే తన సొంతం చేసుకోవాలని ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీకి ధోనీ దరఖాస్తు పెట్టుకున్నాడు.
ట్రేడ్ మార్క్స్ పోర్టల్ ఆ దరఖాస్తును అంగీకరించినట్లు తెలుస్తోంది. జూన్ 1వ తేదీన ట్రేడ్‌మార్క్ పోర్టల్‌లో దీన్ని పబ్లిష్ చేశారు. జూన్ 5వ తేదీన దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ ట్రైనింగ్, స్పోర్ట్స్ ఫెలిసిటీస్, స్పోర్ట్స్ కోచింగ్, సర్వీసెస్ క్యాటగిరీల్లో కెప్టెన్ కూల్ ట్రేడ్‌మార్క్‌ను వాడనున్నారు. ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్న అంశంపై అధికారికంగా ధోనీ స్పందించలేదు.
అయితే ఇదే ట్యాగ్ కోసం ప్రభ స్కిల్ స్పోర్ట్స్ అనే మరో కంపెనీ కూడా దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ అప్లికేషన్ స్టేటస్ మాత్రం రెక్టిఫికేషన్ స్టేజ్‌లో ఉన్నట్లు చూపిస్తున్నది. ధోనీకి ఇటీవల అరుదైన గౌరవం దక్కింది. 2025 ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. మరో ఏడుగురు క్రికెటర్లు కూడా ఆ జాబితాలో ఉన్నారు.
ధోనీ క్రికెట్ కెరీర్‌ను కూడా ఐసీసీ ప్రశంసించింది. వత్తిడిలోనూ ప్రశాంతంగా తన నైపుణ్యంతో మ్యాచ్‌ను ముగించేవాడని, షార్ట్ ఫార్మాట్లోనూ అతను ఎన్నో ఇన్నోవేటివ్ స్ట్రోక్స్ ఆడినట్లు ఐసీసీ పేర్కొన్నది. గ్రేటెస్ట్ ఫినీషర్లలో ధోనీ ఒకరని, అద్భుత సారధి, వికెట్ కీపర్ అని ఐసీసీ తన స్టేట్మెంట్లో తెలిపింది.