అభీభత్సం
అర్నబ్ తుఫాన్ భారత తీరాన్ని వణికిస్తుంటే.. న్యూజిలాండ్‌లోని తీర పట్టణం వెల్లింగ్టన్లో అభిషేక్ శర్మ పరుగుల తుఫాన్ సృష్టించాడు! ఈ జమానాలో బంతిని తనకంటే బలంగా కొట్టే మొనగాడే లేడని నిరూపిస్తూ.. ఫోర్లు, సిక్సర్ల సుడిగాలితో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు..! అసలు సిక్సర్లు బాదడం ఇంత సులువా? సెంచరీ కొట్టడం అంత ఈజీనా? అన్నట్లుగా మైదానంలో విధ్వంసం చేశాడు..! నిప్పుకు వాయువు తోడైనట్లు 35 బంతుల్లోనే శతకొట్టిన శర్మ స్పీడ్‌కు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వీరబాదుడు జతకలిసింది.!
- 35 బంతుల్లోనే వంద
- 80 బంతుల్లోనే 199 టార్గెట్ ఉఫ్
- మూడో టీ20లో భారత్ పరుగుల తుఫాన్
- దంచికొట్టిన అభిషేక్, సూర్యవంశీ
- 3-0తో సిరీస్ నెగ్గిన టీమిండియా
అర్నబ్ తుఫాన్ భారత తీరాన్ని వణికిస్తుంటే.. న్యూజిలాండ్‌లోని తీర పట్టణం వెల్లింగ్టన్లో అభిషేక్ శర్మ పరుగుల తుఫాన్ సృష్టించాడు! ఈ జమానాలో బంతిని తనకంటే బలంగా కొట్టే మొనగాడే లేడని నిరూపిస్తూ.. ఫోర్లు, సిక్సర్ల సుడిగాలితో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు..! అసలు సిక్సర్లు బాదడం ఇంత సులువా? సెంచరీ కొట్టడం అంత ఈజీనా? అన్నట్లుగా మైదానంలో విధ్వంసం చేశాడు..! నిప్పుకు వాయువు తోడైనట్లు 35 బంతుల్లోనే శతకొట్టిన శర్మ స్పీడ్‌కు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వీరబాదుడు జతకలిసింది.!
ఈ ఇద్దరు మొనగాళ్లు ప్రత్యర్థిపై రవ్వంతైనా దయలేకుండా చెలరేగడంతో భారత్ 2.2 ఓవర్లలోనే 50.. 5 ఓవర్లలో 100.. పవర్ ప్లేలో 118.. 7.4 ఓవర్లలోనే 150 పరుగులతో రికార్డుల దుమ్ముదులిపింది. విధ్వంసానికి పరాకాష్టలా సాగిన వీళ్ల ఆటతో 199 పరుగుల లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే ఊదేసి క్రికెట్ ప్రపంచాన్ని మరోసారి నివ్వెరపరిచింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ బ్లాక్‌క్యాప్స్ టీమ్ ప్లేయర్ల మైండ్ బ్లాంక్ చేస్తూ.. తీన్మార్ కొట్టింది.
వెల్లింగ్టన్: యువ ఓపెనర్లు అభిషేక్ శర్మ (38 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్లతో 113), బీహార్ బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ (19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 45) తమ పవర్ హిట్టింగ్తో అభిమానులకు పూనకాలు తెప్పించిన వేళ ముచ్చటగా మూడో టీ20 మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్ హ్యాట్రిక్ సాధించింది. మంగళవారం జరిగిన ఈ పోరులో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఐదు టీ20ల సిరీస్‌ను మరో రెండుమ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకుంది.
ప్రత్యర్థి ఇచ్చిన 199 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి మరో 40 బంతులుండగానే ఛేదించింది. కెప్టెన్ శాంట్నర్ (1/17) తప్ప మిగతా బౌలర్లంతా ఓవర్‌కు 13 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చుకున్నారు. తొలుత కివీస్ 20 ఓవర్లలో 198/3 స్కోరు చేసింది. డారిల్ మిచెల్ (52 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 89 నాటౌట్), ఫిన్ అలెన్ (40), బెవాన్ జాకబ్స్ (39 నాటౌట్) రాణించారు. అభిషేక్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. నాలుగో టీ20 శుక్రవారం అక్లాండ్లో జరుగుతుంది.
హిట్టింగ్ ఎగ్జిబిషన్
క్లిష్టమైన పిచ్, సవాల్ విసిరే వాతావరణంలో భారత్ ముందు మంచి లక్ష్యాన్ని ఉంచిన న్యూజిలాండ్.. మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో నిలవాలన్న లక్ష్యంతో బౌలింగ్ ఆరంభించింది. కానీ, హిట్టింగ్ ఎగ్జిబిషన్‌ను తలపించిన భారత ఓపెనర్ల వీరబాదుడు దెబ్బకు ఆ జట్టు ఆశలు తొలి ఓవర్లోనే ఆవిరయ్యాయి. జాకబ్ డఫీ తొలి బంతినే బౌండ్రీ చేర్చి వైభవ్ తన ఉద్దేశం ఏంటో స్పష్టం చేశాడు. ఓపెనర్లు చెరో సిక్స్ కొట్టడంతో ఫస్ట్ ఓవర్లలోనే 26 పరుగులు వచ్చాయి. రెండో ఓవర్లో మిల్నేకు అభి 6,6,4తో స్వాగతం పలికి 17 రన్స్ రాబట్టాడు.
ఆ తర్వాత బాధితులు బ్రేస్‌వెల్, జెమీసన్. మూడో ఓవర్లో బ్రేస్‌వెల్‌ను 4, 6, 4తో శిక్షించిన అభి.. జెమీసన్‌ను రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో దండించి 15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తానేం తక్కువా అన్నట్టు ఆరో ఓవర్లో వైభవ్ మూడు ఫోర్లతో పాటు పాయింట్ మీదుగా తన మార్కు సిక్స్ కొట్టడంతో పవర్ ప్లేను భారత్ 118 రన్స్‌తో ముగించింది. ఫీల్డింగ్ విస్తరించిన తర్వాత కూడా వేగం తగ్గించని అభి.. బ్రేస్‌వెల్ వేసిన ఏడో ఓవర్లో మరో రెండు ఖతర్నాక్ సిక్సర్లతో అలరించాడు. ఫ్రంట్‌ఫుట్‌ను లైన్ నుంచి పక్కకు జరిపి ఆఫ్ సైడ్ వైపు అలవోకగా సిక్సర్లు కొట్టిన ఓపెనర్లు.. కాలును లైన్ అడ్డంగా కదిలించి లెగ్-సైడ్ వైపు స్వేచ్ఛగా షాట్లు ఆడారు.
ఈ తరహా షాట్లతో శర్మ మైదానం నలుమూలలా విరుచుకుపడుతుంటే.. సూర్యవంశీ ఆట కూడా చిన్నబోయినట్టు కనిపించింది. చివరకు ఏడో ఓవర్లో బౌలింగ్‌కు దిగిన ఫిషర్ తొలి బంతిని గాల్లోకి లేపిన వైభవ్ డారిల్‌కు క్యాచ్ ఇవ్వడంతో తొలి వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యం ముగిసినా.. కివీస్‌కు ఊరట దక్కలేదు. అదే ఓవర్లో మరో రెండు సిక్సర్లు బాదిన అభి తన ఫాస్టెస్ట్ (30 బంతుల్లో) సెంచరీ రికార్డును బ్రేక్ చేసేలా కనిపించాడు. శాంట్నర్ పొదుపుగా బౌలింగ్ చేసినా.. జెమీసన్ బౌలింగ్‌లో ఫోర్‌తో శతకం పూర్తి చేసుకొని మైదానంలో ధ్యాన ముద్రతో సంబరాలు చేసుకున్న శర్మ.. మరో 6,4 బాది ఆఖరి బాల్‌కు ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి తన సునామీ ఇన్నింగ్స్‌ను ముగించాడు. అప్పటికి మరో పది ఓవర్లలో భారత్‌కు 20 పరుగులు అవసరం అయ్యాయి. శాంసన్ (18), అయ్యర్ (5) ఔటైనా మరో 3.2 ఓవర్లలోనే టీమిండియా టార్గెట్‌ను అందుకుంది.

డారిల్ ధనాధన్
తొలుత డారిల్ మిచెల్ ఫామ్‌లోకి వచ్చి మెరుపు ఇన్నింగ్స్ ఆడినా.. డెత్ ఓవర్లలో భారత బౌలర్లు కట్టడి చేసి కివీస్ స్కోరు 200 దాటకుండా చూశారు. టాస్ నెగ్గి మూడోసారి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ అయ్యర్ నిర్ణయానికి న్యాయం చేసిన పేసర్ అర్ష్‌దీప్ తన రెండో బంతికే ఓపెనర్ టిమ్ సిఫర్ట్ (2)ను ఔట్ చేశాడ. కానీ, ఫిన్ అలెన్‌కు తోడైన డారిల్ కౌంటర్ ఎటాక్ చేస్తూ రెండో వికెట్‌కు 86 పరుగులు జోడించాడు.
పవర్ ప్లేలో పర్ఫెక్ట్ లెంగ్త్‌లో బంతులు వేయలేకపోయిన భువీ బౌలింగ్‌లో చెరో సిక్స్ కొట్టిన ఈ ద్వయం తర్వాత ప్రిన్స్, స్పిన్నర్ అక్షర్నూ టార్గెట్ చేసింది. ఐదు సిక్సర్లతో దూకుడు చూపెట్టిన అలెన్… నితీశ్ వేసిన తొమ్మిదో ఓవర్లో నమన్ ధీర్ పట్టిన అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. గ్లెన్ ఫిలిప్స్ (17) నిరాశ పరిచినా.. జాకబ్స్ తోడుగా డారిల్ జోరు కొనసాగించడంతో 16 ఓవర్లకే స్కోరు 150 దాటింది. కానీ, ఆఖరి ఓవర్లలో భువీ, ప్రిన్స్, అర్ష్‌దీప్ మెరుగ్గా బౌలింగ్ చేసి కివీస్ జోరును అడ్డుకున్నారు.
1 ఈ ఫార్మాట్లో భారత్ ఫాస్టెస్ట్50 ( 2.2 ఓవర్లు), 100 (5 ఓవర్లు) స్కోర్లు చేసింది.
4 అంతర్జాతీయ టీ20ల్లో అభిషేక్‌కు ఇది 4వ శతకం. రోహిత్, మ్యాక్స్‌వెల్ (5) టాప్‌లో ఉన్నారు.
5 ఈ ఫార్మాట్లో ఐదు శతకాలను 40 బంతులలోపే చేసిన తొలి బ్యాటర్ అభిషేక్.
7 ఒక టీ20 ఇన్నింగ్స్‌లో 10 కంటే ఎక్కువ సిక్సర్లు బాదడం అభిషేక్ శర్మకు ఇది 7వ సారి. క్రిస్ గేల్ (18 సార్లు) తర్వాత అభిది రెండో స్థానం.
118 అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక (118) పరుగులు చేసిన జట్టు భారత్. 2021లో సెర్బియాపై రొమేనియా 5.4 ఓవర్లలో చేసిన 116 పరుగులు రికార్డు బ్రేక్ అయింది.
150 టీ20ల్లో భారత్ అత్యంత వేగంగా 7.4 ఓవర్లలోనే 150 పరుగులు చేసింది. 2024 ఐపీఎల్లో లక్నోపై సన్‌రైజర్స్ 8.2 ఓవర్లలో ఈ మార్కు అందుకుంది.
11 టీ20 క్రికెట్లో అభిషేక్‌కు ఇది 11వ సెంచరీ. ఈ ఫార్మాట్లో అత్యధిక శతకాలు చేసిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ (10) రికార్డు బ్రేక్ చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్: 20 ఓవర్లలో 198/3 (డారిల్ మిచెల్ 89*, అలెన్ 40, అర్ష్‌దీప్ 1/33); భారత్: 13.2 ఓవర్లలో 199/4 (అభిషేక్ 113, వైభవ్ 45, శాంట్నర్ 1/17)
అభిషేక్
బంతులు : 38
ఫోర్లు : 9
సిక్సర్లు : 11
పరుగులు : 113
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

