ఢిల్లీ: ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించిన సాక్షి మాలిక్ (రియో), అమన్ సెహ్రావత్ (పారిస్)తో పాటు మాజీ వరల్డ్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత గీతా ఫోగాట్ (వినేశ్ ఫోగాట్ సోదరి) కలిసి కొత్త రెజ్లింగ్ చాంపియన్‌షిప్ లీగ్‌ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. యువ, వర్ధమాన రెజ్లర్లను ప్రోత్సహించేందుకు గాను తాము ముగ్గురం కలిసి రెజ్లింగ్ చాంపియన్స్ సూపర్ లీగ్ (డబ్ల్యూసీఎస్ఎల్)ను ప్రారంభించనున్నట్టు వారు తెలిపారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ.. ‘సాక్షి, నేను చాలాకాలంగా ఈ లీగ్‌ను ప్రారంభించాలని అనుకుంటున్నాం. త్వరలోనే ఇది తుది రూపును సంతరించుకోనుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)తో మేం ఇప్పటిదాకా అయితే సంప్రదింపులు జరుపలేదు. కానీ మాకు ప్రభుత్వంతో పాటు సమాఖ్య మద్దతు కావాలి. క్రీడాకారులే నిర్వహించబోతున్న తొలి లీగ్ మాదే కాబోతుంది. దీనిని మేం పూర్తిగా యువ రెజ్లర్ల కోసం ప్రారంభించబోతున్నాం. ఇందులోకి ఎవరైనా రావొచ్చు. మేం ఎవరినీ వద్దనం. రెజ్లర్లు కూడా ఎవరి బలవంతం లేకుండా ఈ లీగ్‌లో పాల్గొనవచ్చు’ అని తెలిపింది. అయితే దీనిపై డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ సంజయ్ సింగ్ స్పందిస్తూ.. ‘మేం దానిని ఆమోదించబోం. మేము మా రెజ్లింగ్ లీగ్‌ను పునరుద్ధరించే పనిలో ఉన్నాం. రెజ్లర్లు తమ సొంత లీగ్‌ను నిర్వహించుకునేందుకు మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. వాళ్లు ఆటను ప్రమోట్ చేసుకోవచ్చు. కానీ దానితో మాకు సంబంధమూ లేదు’ అని తెలపడం గమనార్హం.