హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాజ్‌కోట్(గుజరాత్) వేదికగా జరుగుతున్న 68వ ఎస్జీఎఫ్ఐ జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ల పతక హవా దిగ్విజయంగా కొనసాగుతున్నది. గురువారం జరిగిన బాలికల అండర్-14 200మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో రాష్ట్ర యువ స్విమ్మర్ శివానీ కర్రా 2:33:36సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకుంది. శ్రేయా(సీఐఎస్సీఈ), దయానీ పటేల్(గుజరాత్) వరుసగా రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. మరోవైపు బాలికల అండర్-17 200మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ కేటగిరిలో నిత్య సాగి(2:27:95సె) పసిడి దక్కించుకోగా, మీనాక్షి (సీఐఎస్సీఈ), సాగ్నిక (పశ్చిమ బెంగాల్) రజత, కాంస్యాలు కైవసం చేసుకున్నారు.