Guinea | కొనాక్రె(గునియా): ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో మరో మాయని మచ్చ! అభిమానం హద్దులు దాటిన వేళ కొట్టుకుచచ్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. గునియాలోని నెజెర్కొరె నగరంలో ఆదివారం ద లాబె, నెజర్కొరె జట్ల మధ్య జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ అభిమానులకు పీడకలను మిగిల్చింది. రిఫరీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెండు జట్లకు చెందిన ఫ్యాన్స్ గుంపులు గుంపులుగా విడిపోయి కొట్టుకున్నారు. వేలాది మంది కిక్కిరిసిన స్టేడియంలో ఎవరూ ఊహించని విధంగా తొక్కిసలాట జరిగింది. స్టేడియం నుంచి బయటపడేందుకు ఒకరినొకరు తోసుకోవడంతో చిన్నపిల్లలు, మహిళలు కాళ్ల కింద నలిగిపోయారు.
ఈ ఉదంతంలో ఇప్పటి వరకు 56 మంది పౌరులు మరణించినట్లు గునియా మీడియా సంస్థలు పేర్కొన్నాయి. మిలటరీ లీడర్ మమాడీ దౌమబోయా గౌరవార్థం ఈ సాకర్ మ్యాచ్ చివరికి రక్తసిక్తమైంది. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్ పోలీసులపైకి రాళ్లదాడికి దిగడం పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసినట్లు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. శవాలు అటు స్టేడియంతో పాటు రోడ్లపై కుప్పలు కుప్పలుగా పడిపోగా, తీవ్రంగా గాయపడ్డ వారిని దవాఖానకు తరలించి చికిత్స అందించారు. అయితే ఈ ఘటనలో ఇంకా ఎంతమంది చనిపోయారన్నది తేలాల్సి ఉంది. జరిగిన ఉదంతంపై విచారణకు ఆదేశిస్తున్నట్లు గునియా ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులపై విచారణలో తేలే అవకాశముంది.