నమస్తే తెలంగాణ క్రీడా విభాగం..
Hockey | హాకీ భారతీయుల భావోద్వేగ క్రీడ! కులం, మతం, భాషతో సంబంధం లేకుండా ఆటతో మమేకమైన రోజులవి. స్వాతంత్య్రం రాక ముందే నుంచే హాకీలో మనది ఘనమైన చరిత్ర. 1920 నుంచి 1980 వరకు హాకీలో మనకు ఎదురన్నదే లేదు. అమెస్టార్డామ్(1928) ఒలింపిక్స్ నుంచి మొదలుపెడితే మాస్కో(1980) వరకు భారత్‌ది స్వర్ణచరిత్ర. బరిలోకి దిగితే పసిడి పక్కా అన్న రీతిలో మనోళ్లు వీరవిహారం చేసిన చిరస్మరణీయ సందర్భాలు. హాకీలో మనకు తిరుగేలేదన్న రీతిలో పతకాలు కొల్లగొట్టిన తీరు నభూతో నభవిష్యత్. ఒలింపిక్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా 1975 ప్రపంచకప్‌లో మన హాకీ వీరులు సాధించిన విజయం మరువలేనిది. మలేషియా గడ్డపై దాయాది పాకిస్థాన్‌ను మట్టికరిపిస్తూ అజిత్పాల్సింగ్ సారథ్యంలోని భారత్ తొలిసారి ప్రపంచకప్ టైటిల్ ఒడిసిపట్టుకుంది. ఆద్యంతం అద్భుత ప్రదర్శన భారత్..చిరస్మరణీయ విజయం సొంతం చేసుకున్నారు. మలేషియా గడ్డపై త్రివర్ణ పతాకం రెపరెపలాడి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కథనం.
భారత హాకీది ఘనమైన చరిత్ర. బ్రిటిషర్ల పాలనలో ఓవైపు క్రికెట్ వ్యాపిస్తున్న వేళ అప్పటికే హాకీలో స్వర్ణ యుగం మొదలైంది. ఇంతకుముందే చెప్పుకున్నట్లు హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ కళాత్మక ఆటతీరుతో 1920లోనే మొదలైన మన హాకీ పసిడి వెలుగులు 1980 వరకు దిగ్విజయంగా కొనసాగాయి. అ కాలంలో స్వర్ణ పతకానికి తక్కువ ఏదైనా అది విఫల ప్రదర్శన అన్నట్లు అభిమానులు భావించేవారు. హాకీలో మన ఆధిపత్యానికి ఇది తార్కాణమని చెప్పొచ్చు. అప్పటికే విశ్వక్రీడల్లో పసిడి పతక జైత్రయాత్ర కొనసాగుతున్న వేళ మలేషియా వేదికగా 1975లో జరిగిన హాకీ ప్రపంచకప్‌లో భారత స్వర్ణ పతక ప్రదర్శన చిరస్మరణీయమని చెప్పాలి. దేశం ఎమర్జెన్సీ వైపు అడుగులు వేస్తున్న వేళ యావత్ జాతిని మళ్లీ ఒక్కతాటి పైకి తీసుకొచ్చింది. అజిత్పాల్సింగ్ సారథ్యంలోని భారత్ హోరాహోరీగా సాగిన ఫైనల్లో పాకిస్థాన్‌పై 2-1తో చారిత్రక విజయం సాధించింది.
అంతకుముందు 1971 ప్రపంచకప్‌తో పాటు మ్యూని చ్ ఒలింపిక్స్(1972) ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలతో సరిపెట్టుకున్న భారత్ మూడేండ్ల వ్యవధిలో జరిగిన మెగాటోర్నీలో సత్తాచాటిన తీరు అమోఘమని సీనియర్ క్రీడా విశ్లేషకులు చంద్రశేఖర్..నమస్తే తెలంగాణతో చెప్పుకొచ్చారు. క్రికెట్ కంటే ముందే హాకీలో భారత్ అపురూప విజయాలు సొంతం చేసుకుందని ఆయన పేర్కొన్నారు. పాక్‌తో ఫైనల్‌కు ముందు ఆతిథ్య మలేషియాతో సెమీస్ పోరు హోరాహోరీగా సాగింది. ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో ఆఖరి నాలుగు నిమిషాల్లో యువ ప్లేయర్ అస్లాం షేర్‌ఖాన్ అద్భుతం చేశాడు. అప్పటి వరకు 2-1తో ఆధిక్యంలో ఉన్న మలేషియాను మట్టికరిపించాడు. కెప్టెన్ అజిత్‌పాల్ సూచనతో పెనాల్టీ కార్నర్ షాట్‌ను ప్రత్యర్థి గోల్కీపర్ను ఏమారుస్తూ అస్లాం కొట్టిన గోల్‌తో భారత్ గెలుపు సంబురాల్లో మునిగిపోయింది.
దీంతో స్కోరు 2-2తో డ్రా కాగా అదనపు సమయంలో హర్చరణ్ గోల్‌తో భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. పాక్‌తో తుదిపోరులో భారత్ తరఫున సుర్జీత్‌సింగ్(44ని), ధ్యాన్‌చంద్ కొడుకు అశోక్‌కుమార్(51ని) గోల్స్ చేశారు. జాహిద్(17ని) పాక్‌కు ఏకైక గోల్ అందించాడు. ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన పోరులో భారత్‌నే విజయం వరించింది. ఈ మ్యాచ్‌కు లైవ్ కామెంటరీ అందించిన జస్విందర్‌సింగ్, డిమెల్లో వ్యాఖ్యానంతో భారతావని పులకించిపోయింది. అప్పటి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన అస్లాం ఆ తర్వాత ఎంపీగా ఎన్నికయ్యాడు. అయితే 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల హాకీ ఇండియా అనాటి జట్టు సభ్యులను ఘనంగా సన్మానించింది. హాకీ చరిత్రకారుడు అర్ముగమ్, ఎరోల్ డిక్రజ్ రాసిన ‘మార్చ్ ఆఫ్ గ్లోరీ’ పుస్తకాన్ని ఇటీవలే ఆవిష్కరించారు. అనాటి చారిత్రక విజయాన్ని ప్రేరణగా తీసుకోని భారత హాకీ పునర్వైభవం దిశగా అడుగులు వేస్తుందని ఆశిద్దాం.