చండూరు, అక్టోబర్ 29: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు తన ఉదారతను చాటుకున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామంటూ యువ ఫెన్సర్ షేక్ నజియా చేసిన అభ్యర్థనకు మంత్రి తక్షణమే స్పందించారు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తూ పతకాలు సాధిస్తున్న నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారి గడ్డ గ్రామానికి చెందిన నజియాకు ఆయన మద్దతుగా నిలిచారు. మంత్రి ఆదేశాలకు అనుగుణంగా సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, తెలంగాణ ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, బంగారి గడ్డ గ్రామ ఇన్చార్జి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ శనివారం నజియా ఇంటికి వెళ్లి రాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేషన్ తరఫున రూ.50వేల చెక్‌తో పాటు స్పోర్ట్స్ కిట్‌ను అందజేశారు.
ఏషియన్ అండర్-17 ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో రజతంతో పాటు కామన్వెల్త్ క్యాడెట్ టోర్నీలో రెండు కాంస్య పతకాలతో మెరిసిన నజియా ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నది. కామన్వెల్త్ క్యాడెట్ చాంపియన్‌షిప్ సందర్భంగా గాయపడ్డ ఈ 17 ఏండ్ల యువ ఫెన్సర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. ఇంటర్మీడియట్ వరకు హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో విద్యనభ్యసించిన నజియా ప్రస్తుతం ఔరంగాబాద్ సాయ్ కేంద్రంలో శిక్షణ పొందుతున్నది. భవిష్యత్‌లో నజియాకు అన్ని రకాలుగా అండగా ఉంటామమని వెంకటేశ్వర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తోడ్పడుతున్నామని అన్నారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి కేటీఆర్‌కు నజియా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది.