న్యూయార్క్: మహిళ టెన్నిస్‌లో దిగ్గజ క్రీడాకారిణి సెరీనా విలియమ్స్(Serena Williams) మళ్లీ రాకెట్ పట్టనున్నది. దాదాపు నాలుగేళ్ల పాటు ప్రొఫెషనల్ ఆటకు దూరంగా ఉన్న ఆమె.. త్వరలో ప్రారంభంకానున్న క్వీన్స్ క్లబ్ టోర్నీలో ఆడనున్నది. మహిళల డబుల్స్ ఈవెంట్లో పాల్గొనేందుకు ఆమె వైల్డ్ కార్డు పొందింది. జూన్ 8వ తేదీ నుంచి ఆ పోటీ ప్రారంభంకానున్నది. కెనడా యువ ప్లేయర్ విక్టోరియా మొబోకో తో ఆమె జతకట్టనున్నది. 2022 నుంచి సెరీనా టెన్నిస్‌కు దూరంగా ఉంది. తన 27 ఏళ్ల కెరీర్లో సెరీనా ఇప్పటి వరకు 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుచుకున్నది.
సెరీనా మళ్లీ రాకెట్ పట్టబోతున్నట్లు గత ఏడాది నుంచే రూమర్స్ వచ్చాయి. డ్రగ్ టెస్టింగ్ పూల్‌కు ప్లేయర్లను రిజిస్టర్ చేసిన లిస్టులో సెరీనా పేరు ఉండడంతో ఆ అనుమానాలు వ్యాప్తి అయ్యాయి. అయితే తాజాగా సోమవారం సెరీనా తన సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేసింది. తన తదుపరి జర్నీ ప్రారంభించేందుకు క్వీన్స్ క్లబ్ పర్ఫెక్ట్ ప్లేస్ అని ఆలోచిస్తున్నట్లు విలియమ్స్ పేర్కొన్నది.
2022లో చివరిసారి యూఎస్ ఓపెన్ ఆడిన ఆమె ఇప్పుడు మళ్లీ రాకెట్‌తో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అయితే వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లో కూడా సెరీనా విలియమ్స్ పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.