న్యూఢిల్లీ: జాతీయ క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్)లో లైంగిక వేధింపుల పరంపర కొనసాగుతున్నది. గత దశాబ్ద కాలంలో సాయ్‌లో 33 లైంగిక వేధింపుల కేసులు నమోదైనట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. సోమవారం లోక్‌సభలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ఈ వివరాలను అధికారికంగా వెల్లడించారు.
గత పదేండ్ల కాలంలో సాయ్ అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందిపై ఎనిమిది ఫిర్యాదులు రాగా, 2016 నుంచి కోచ్‌లపై 25 కేసులు నమోదైనట్లు ఆయన స్పష్టం చేశారు. ఇందులో సీసీఎస్ నిబంధనలు(1972) ప్రకారం ఒక కేసు శాశ్వతంగా విత్‌హోల్డ్‌లో ఉండగా, మిగతావి జరిమాన లేకుండా ముగిసినట్లు మంత్రి తెలిపారు.
కేసులతో సంబంధం ఉన్న ఇద్దరు కోచ్‌లపై బహిష్కరణ, ఆరుగురిపై సస్పెన్షన్, ఆరుగురిపై సాధారణ జరిమానా పడిందని సభకు వివరించారు. అయితే జాతీయ క్రీడా సమాఖ్యల్లో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉన్నట్లు తెలిపారు. దీనికి తోడు ‘షీ బాక్స్’ పోర్టల్ కూడా వినియోగంలోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.