న్యూయార్క్ : సీజన్ నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ తొలి రోజే రసవత్తరంగా మొదలైంది. కెరీర్ 25వ టైటిల్ వేటలో ఉన్న నొవాక్ జొకోవిచ్‌తో పాటు మహిళల సింగిల్స్‌లో నెంబర్ వన్ సీడ్ అరీనా సబలెంకా, ఏడో సీడ్ జాస్మిన్ పౌలోని (ఇటలీ) శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ డేనియల్ మెద్వెదెవ్కు తొలి రౌండ్లోనే షాక్ తగిలింది. జొకో.. 6-1, 7-6 (7/3), 6-2తో లెర్నర్ టైన్ (అమెరికా)ను వరుస సెట్లలో చిత్తు చేశాడు. సబలెంక.. 7-5, 6-1తో మసరొవ (స్విట్జర్లాండ్)పై అలవోక విజయం సాధించగా పౌలోని 6-2, 7-6 (7/4)తో డెస్టానీ ఐవ (ఆస్ట్రేలియా)పై గెలిచింది.
భారత కాలమానం ఆదివారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో మెద్వెదెవ్.. 3-6, 5-7, 7-6 (7/5), 6-0, 4-6తో బెంజిమిన్ బొంజి (ఫ్రాన్స్) చేతిలో పోరాడి ఓడాడు. ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో గెలుపు కోసం మెద్వెదెవ్ పోరాడినా అతడికి అపజయం తప్పలేదు. మ్యాచ్‌లో ఓటమి కంటే ఆట మధ్యలో మెద్వెదెవ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగడం, ప్రేక్షకుల వైపు చూస్తూ అభ్యంతరకర సంజ్ఞలు చేయడం, మ్యాచ్ ముగిశాక రాకెట్‌ను పూర్తిగా విరిగేలా నేలకేసి బాదడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. పురుషుల సింగిల్స్‌లో అమెరికా అబ్బాయిలు బెన్ షెల్టన్, టేలర్ ఫ్రిట్జ్ రెండో రౌండ్‌కు ముందంజ వేశారు. మహిళల సింగిల్స్‌లో జెస్సికా పెగులా, క్రెజికోవ, ఎమ్మా రడుకాను, విక్టోరియా అజరెంకా తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు.