Zomato | ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో తన 10-మినిట్స్ ఫుడ్ డెలివరీ సర్వీస్ `జొమాటో ఇన్స్టంట్`ను నిలిపేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న కఠిన పరిస్థితుల నేపథ్యంలో ప్రారంభించిన ఏడాది లోపే `జొమాటో ఇన్స్టంట్` సర్వీస్ నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. ఇలా జొమాటో ఇన్స్టంట్ సర్వీస్‌ను నిలిపేస్తున్నట్లు తమ రెస్టారెంట్ పార్టనర్లకు ఇటీవలే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. జొమాటో ఇన్స్టంట్ సర్వీస్ స్థానే మెరుగైన సర్వీస్ అందుబాటులోకి తేనున్నట్లు వినికిడి.
`మేం ప్రారంభించిన న్యూ సర్వీస్ లాభాల్లోకి వచ్చేలా కనిపించడం లేదు. రోజువారీగా ఫిక్స్డ్ ధరల చెల్లింపు స్థాయికి కంపెనీ చేరుకోలేదు` అని జొమాటో వర్గాలు తెలిపాయి. జొమాటో ఇన్స్టంట్ స్థానే మెరుగైన సర్వీస్‌ను అందుబాటులోకి తేవడానికి ప్రణాళిక రూపొందించినట్లు సంస్థ వర్గాల కథనం. తక్కువ విలువైన ప్యాక్డ్ మీల్, తాలిస్ ఆర్ కోంబో మీట్స్ వంటి సర్వీస్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు జొమాటో వర్గాలు వెల్లడించాయి. న్యూ ఆఫర్ సర్వీస్ వచ్చే 7-10 రోజుల్లో ప్రారంభం అవుతుందని ఆ సంస్థ వర్గాల కథనం.
జొమాటో ఇన్స్టంట్ సర్వీస్‌ను పూర్తిగా మూసేయడం లేదని, సర్వీస్‌ను రీబ్రాండ్ చేస్తున్నామని వివరించింది. గతేడాది మార్చిలో జొమాటో ఇన్స్టంట్ సర్వీస్‌ను ప్రారంభించారు. `ఇన్స్టంట్ మూసేయడం లేదు. మా భాగస్వాములతో న్యూ మెనూపై మేం పని చేస్తున్నాం. బిజినెస్ రీబ్రాండింగ్‌పై దృష్టి పెట్టాం. అన్ని స్టేషన్లలో ఈ సర్వీస్ యధాతథంగా కొనసాగుతుంది. ఈ నిర్ణయం వల్ల ఎవరిపైనా ప్రతికూల ప్రభావం పడదు` అని జొమాటో ఓ ప్రకటనలో తెలిపింది.
`ప్రపంచంలో ఏ ఒక్కరూ ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో వేడివేడిగా, ఫ్రెష్ ఫుడ్ డెలివరీ చేయలేరు. ఈ క్యాటగిరీలో సేవలందించేందుకు మేం ఆసక్తిగా ఉన్నాం` అని జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. జొమాటో ఫినిషింగ్ స్టేషన్లన్నింటా వివిధ రెస్టారెంట్ల నుంచి 20-30 బెస్ట్ డిషెష్ స్టాక్ పెట్టుకుని సేవలందించామని తెలిపారు. గిరాకీ పుంజుకుంటుందన్న అంచనాల మధ్య ఈ సర్వీస్ ప్రారంభించామన్నారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోనూ, తాజాగా బెంగళూరులోనూ ఈ సర్వీస్ అందుబాటులోకి తెచ్చింది జొమాటో.