Quora | ఇంటర్నెట్లో సమాచారం దొరుకుతుంది. కానీ సమాధానాలు ఉండవు. దీంతో ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతుంది. నిద్రలోనూ ఆ క్వశ్చన్‌మార్క్ వెంటాడుతుంది. జిజ్ఞాసికి అదో నరకం. ప్రశ్నోత్తరాల వేదిక కోరా ఆ కష్టాన్ని తప్పిస్తుంది. తన వేదిక మీద ప్రశ్నించే అవకాశం ప్రసాదిస్తుంది. సమాధానాలు ఇచ్చే అదృష్టమూ కల్పిస్తుంది. ఈ మధ్యే పదమూడేండ్లు నిండిన కోరాను దర్జాగా తెలుగులోనూ సమాధానాలు కోరవచ్చు.
నా నెల జీతాన్ని ఎలా ఖర్చుపెట్టుకోవాలి? ఈ రోజు ఓ వంద ఐటీసీ షేర్లు కొంటే, పదేండ్ల తర్వాత వాటి విలువ ఏ మేరకు పెరుగుతుంది?
చెన్నై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ అత్యుత్తమ నగరం అనిపిస్తున్నది. మీ అభిప్రాయం?
మా అమ్మాయికి జేయీయీలో వచ్చిన ర్యాంకు.. పదిహేడు వేలు. ఏ క్యాంపస్‌లో సీటు వచ్చే అవకాశం ఉంది?
రిషి సునక్ పాకిస్థానీ అంటారు. నిజమేనా?
అశ్వగంధతో లైంగిక సామర్థ్యం పెరుగుతుందా?
..మనిషి బుర్ర ఓ క్వశ్చన్ బ్యాంక్. తలనిండా ప్రశ్నలే. ప్రశ్న వెనకాలే జవాబు. ఆ జవాబులోంచి ఇంకో ప్రశ్న. కొన్ని ప్రశ్నలకు తల ఉంటుంది. తోక ఉండదు. కొన్ని ప్రశ్నలకు తల ఉండదు. కానీ తోక మాత్రం కనిపిస్తుంటుంది. తలాతోకాలేని ప్రశ్నలు బోలెడు. ఏ ఒక్కప్రశ్నకు జవాబు దొరక్కపోయినా స్థిమితంగా ఉండలేం. ఆ క్వశ్చన్ మార్క్ అదేదో పురుగులా మెదడును తొలిచేస్తూ ఉంటుంది. వికీపీడియాకు తెలియని విషయాలూ చాలానే ఉంటాయి. కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాలంటే జీవితానుభవం ఉండాలి. రాటుదేలినవారే నిఖార్సయిన సమాధానం ఇస్తారు. తలపండకపోతే జవాబూ పండదు. కొన్ని ప్రశ్నలకు 360 డిగ్రీల జవాబు అసాధ్యం. అంధులు ఏనుగును వర్ణించినట్టే ఉంటుంది వ్యవహారం. మనకిప్పుడు కావాల్సింది.. కడుపుకు అన్నం తిన్నా తినకపోయినా.. క్వశ్చన్ బ్యాంక్ తినగలిగేవాళ్లు కావాలి. కానీ..
ఎలా? ఎలా? ఎలా?
తూకమేసినంత కచ్చితంగా సమాధానం చెప్పగల వేదికే లేదా?
ఉంది. ఉంది. ఉంది. పేరు కోరా.
ఇదో ప్రశ్నోత్తరాల నెట్వర్క్. వయసు.. జూన్‌తో పదమూడేండ్లు నిండాయి. ఆడమ్ డి యాంజెలో, చార్లీ చీవర్ అనే యువకులు స్థాపించారు. ఇద్దరూ గతంలో ఫేస్బుక్లో పనిచేశారు. మన భావాలను, ఆలోచనలను, అనుభవాలను పంచుకోడానికి ఫేస్బుక్ ఓ మంచి వేదిక. తిరుగులేదు. కానీ, అక్కడ సందేహాలను నివృత్తి చేసుకోలేం. ప్రశ్న మనిషిని స్థిమితంగా ఉండనీయదు. ప్రశ్నలు పెరిగేకొద్దీ మానసిక జాడ్యాలకు దగ్గరవుతాం కూడా.‘తొలి రోజుల్లో మేం వారాంతాల్ని, సెలవు రోజుల్ని కొత్త ఐడియాలకే కేటాయించేవాళ్లం. ఆ మేధోమథనంలోనే కోరా పుట్టింది. బంధువులు, మిత్రులు, శత్రువులు.. అందరితోనూ సంభాషించాక ఓ స్పష్టత వచ్చింది. కోరా పుట్టింది’ అంటారు వ్యవస్థాపకుల్లో ఒకరైన చార్లీ. 2010, జూన్ 21న కోరాను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్‌కు సంక్షిప్త రూపం.. కోరా. ఇక్కడ నిపుణుల బృందం ఉండదు. ఎవరైనా ప్రశ్న అడగొచ్చు. ఎవరైనా జవాబు ఇవ్వొచ్చు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ.. అనుకోవాల్సిన పన్లేదు. మన సందేహాన్ని ఎవరో తీరుస్తారు. ఎవరి సందేహాన్నో మనం నివృత్తి చేస్తాం. అంతే తేడా! అనుభవాల్ని, నైపుణ్యాన్ని, పాండిత్యాన్ని సమాధానాల రూపంలో షేర్ చేసుకోవడం అన్నమాట. పట్టాలతో పన్లేదు. ప్రతిభాపాటవ ప్రదర్శనా అవసరం లేదు. సూటిగా ప్రశ్న. అంతే సూటిగా జవాబు. ఆ ఫార్ములా జనానికి బాగా ఎక్కింది. ఏడాది తిరిగేసరికి ట్రాఫిక్ పెరిగింది. ఓ దశలో గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఏదైనా సమాచారాన్ని వెదికినప్పుడు కోరాకే రీడైరెక్ట్ అయ్యేది. అంతటి పాపులారిటీ. విద్యార్థులు, సైంటిస్టులు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు.. సమాజంలోని అన్ని వర్గాలూ కోరాపై ఆధారపడేవి. సాక్షాత్తు వ్యవస్థాపకులు కూడా తలోచేయి వేసి జవాబులు ఇచ్చేవారు.
అప్పట్లో, ప్రశ్న అడగాలంటే జవాబు చెప్పాల్సిందే? అనే నిబంధన ఉండేది. దీన్నే ‘కోరా క్రెడిట్ సిస్టమ్’ అని పిలిచేవారు. ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తం కావడంతో ఈ పద్ధతిని రద్దు చేశారు. ఆ తర్వాత తలుపులు బార్లా తెరుచుకున్నాయి. ఎవరైనా అడగొచ్చు. ఎవరైనా చెప్పొచ్చు. ఈ దశాబ్ద కాలంలో.. తనను తాను సరిదిద్దుకుంటూ, శక్తిమంతం చేసుకుంటూ కోరా చాలా మార్పులకే గురైంది. దీంతో ఇన్వెస్టర్లు వరుస కట్టారు. మొదట్లో ప్రకటనలను ఆమోదించేవారు కాదు. సిబ్బంది పెరిగేకొద్దీ, ట్రాఫిక్ అధికమయ్యేకొద్దీ ఖర్చులు పెరిగాయి. దీంతో ప్రకటనలను స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదట ఇంగ్లిష్‌కే పరిమితమైనా.. క్రమంగా ప్రపంచ భాషలన్నిటిలోకీ ప్రవేశించింది. భారతీయ మార్కెట్ ప్రాధాన్యాన్ని కోరా త్వరగానే గుర్తించింది. మూడేండ్ల క్రితం.. మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లోనూ ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇచ్చింది. ఆదాయ వనరులను పెంచుకోడానికి ప్రత్యేకంగా పెయిడ్ సర్వీసులనూ ప్రారంభించింది. కొవిడ్ సమయంలో.. కోరా చాలా కష్టాలే ఎదుర్కొంది. ఓ దశలో ఆ సంస్థ సర్వర్‌లోని డాటా చేతులు మారిందనే విమర్శలూ వచ్చాయి. కానీ ఇవేవీ ఆ వేదిక ప్రగతిని ఆపలేకపోయాయి. ఇప్పుడు, సొంతగడ్డ మీదకంటే భారత్‌లోనే కోరా సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ.
కోరా ప్రశ్నలను ప్రోత్సహిస్తుంది. జవాబులనూ ప్రోత్సహిస్తుంది. సమాజంలో ప్రశ్నలకు కొదవలేదు. అత్యుత్తమ సమాధానాల కొరత మాత్రం చాలానే ఉంది. కాబట్టే కోరా తరచూ టాప్ రైటర్స్ ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది. విశ్లేషణాత్మకమైన సమాధానాలు ఇచ్చేవారిని గుర్తించి తగు రీతిన గౌరవిస్తుంది. చిన్నాపెద్దా కానుకలు అందిస్తుంది. కోరా రోజువారీ బాధ్యతల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌నూ జోడించారు. దీంతో అత్యంత ఆదరణ ఉన్న సమాధానాలు పైవరుసకు చేరుకుంటాయి. జనం పెద్దగా పట్టించుకోని జవాబులు అట్టడుగున పేరుకుపోతాయి. ఫలానా ప్రశ్న అసభ్యంగా ఉందనో, ఫలానా జవాబు నైతిక నియమావళికి విరుద్ధమనో నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లే అవకాశమూ ఉంది. పబ్లిసిటీ కోసం కోరా ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టిన దాఖలాలు లేవు. ప్రశ్న-జవాబులే ఈ వేదికకు పంచప్రాణాలు. ఆ గుడ్‌విల్‌తోనే ఈ స్థాయికి ఎదిగింది కూడా! ఎంతవరకు నిజమో తెలియదు కానీ, కోరాలో చాలా ప్రశ్నలను రోబోలే అడుగుతాయని ప్రచారం. భారతీయులు ఒక సమాధానంతో సంతృప్తి చెందరు. సెకెండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ కోరుకుంటారు. అలాంటివారికి కోరాలో బోలెడన్ని జవాబులు. ప్రశ్న స్పష్టంగా ఉండాలి, వాక్యనిర్మాణ దోషాలు లేకుండా చూసుకోవాలి, హుందాగా క్లుప్తంగా ఉండాలి, ఎవరి గౌరవానికీ భంగం కలిగించకూడదు.. ఇలా కోరా చాలా నిబంధనలే పెట్టింది. జవాబులకు కూడా ఇవే షరతులు వర్తిస్తాయి. ఎవరైనా కోరాలో ప్రశ్న పోస్ట్ చేయగానే.. గతంలో ఈ తరహా ప్రశ్నలకు జవాబులు ఇచ్చినవారికి అలర్ట్ మెసేజ్ వెళ్తుంది. తక్షణం స్పందించవచ్చు. ఈ వేదిక ద్వారా లాయర్లు, పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు తమ బ్రాండ్ విలువను పెంచుకునే అవకాశమూ ఉంది. పెంచుకుంటున్నారు కూడా!
ప్రపంచాన్ని చదవాలంటే విశ్వమంతా చుట్టిరావాల్సిన పన్లేదు. కోరాలో ప్రశ్నలు చదివితే సరిపోతుంది. ప్రతి ప్రశ్న వెనుకా ఓ సమస్య. ప్రతి సమస్య వెనుకా ఓ సంక్షోభం. ప్రతి సంక్షోభం ఓ వ్యాపార అవకాశమే. ఆంత్రప్రెన్యూర్స్ బిజినెస్ ఐడియాలను వెతుక్కోవచ్చు. రచయితలు కంటెంట్ సృష్టించుకోవచ్చు. మేధావులు కేస్ స్టడీస్‌ను పట్టుకోవచ్చు. కోరాకు రాయడం ద్వారా మన రచనా నైపుణ్యానికి మెరుగులు పెట్టుకోవచ్చు. మనకంటూ ఓ బ్రాండ్ విలువ సృష్టించుకోవచ్చు. భారతీయుడైన బాలాజీ విశ్వనాథన్ 6,23,000 ఫాలోవర్లతో కోరాలో నంబర్ వన్ ఇన్ఫ్లుయన్సర్గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇంగ్లిష్‌లో ఎత్తేశారు కానీ, కొన్ని భాషలకు సంబంధించి మాత్రం.. అత్యధిక వీక్షణలు పొందిన జవాబులకు కోరా పారితోషికాలు కూడా ఇస్తున్నది. జీవితం అంటేనే ప్రశ్నలమయం. ఒక ప్రశ్నతో సందేహం తీరిపోదు. ఒక సమాధానంతో మనసు సంతృప్తి చెందదు. ఉప-ప్రశ్నలూ పుట్టుకొస్తాయి. కోరాలో మనం ఇచ్చే సమాధానం నచ్చితే.. మనల్ని నేరుగా సంప్రదించే అవకాశం ఉంది. అలా అడ్వొకేట్స్కు కొత్త క్లయింట్స్ వస్తారు. డాక్టర్లకు మరికొంత మంది పేషెంట్లు దొరుకుతారు. ఇంకేముంది, ఆదాయం పైపైకి దూసుకుపోతుంది. మనకంటూ ఓ ప్రొఫైల్ ఉంటుంది కాబట్టి, జవాబు ఆసక్తికరంగా అనిపిస్తే.. తప్పకుండా క్లిక్ చేస్తారు. మన ఇ-గడపలో కాలుపెడతారు. మన అభిమానులైపోతారు. మన బ్రాండ్ రాయబారులుగా పనిచేస్తారు. ఇంతకంటే ఏం కావాలి? థ్యాంక్స్ టు కోరా.. అనుకోవాల్సిందే మనసులోనైనా.
కోరాలో ఇచ్చే సమాధానాలపై ఎంతవరకూ ఆధారపడవచ్చు? పూర్తిగా విశ్వసించలేమా? అనే ప్రశ్న తలెత్తిన ప్రతిసారీ సుమతీ శతకకర్తను గుర్తు చేసుకోవాలి.
వినదగునెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!
కోరాను అడగడంలో తప్పులేదు. కానీ, అందులోని మంచిచెడ్డలను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. అందులోనూ కోరా పదమూడేండ్లలోపు వారికి నిషిద్ధం. ఎందుకంటే, ఆ వయసులో మంచిచెడులు బేరీజు వేసుకునేంత విచక్షణ ఉండదు. అన్నిటికీ మించి వ్యక్తిగత వివరాల విషయంలో మన జాగ్రత్తలో మనం ఉండాలి. అసలు పేరు వెల్లడించకపోవడం ఉత్తమం. ప్రమాదాలు జరుగుతాయని ప్రయాణించడం మానేయం. బైక్ అయితే హెల్మెట్ ధరిస్తాం. కారు అయితే సీట్‌బెల్ట్ పెట్టుకుంటాం. కోరా విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. కోరాను జవాబు కోరడంలో తప్పులేదు. అంతిమ నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి.
‘విజ్ఞానాన్ని పంచుకుని, ప్రపంచాన్ని మరింత బాగా అర్థం చేసుకునేందుకు ఓ వేదిక’ అంటూ తెలుగు కోరా తనను తాను సవినయంగా పరిచయం చేసుకుంటుంది. తెలుగువాళ్లకు సహజంగానే సందేహాలు ఎక్కువ. ఎదుటివాళ్లను ఇంటరాగేట్ చేసి అయినా సరే.. కోరుకున్న సమాచారం రాబడతారు. ఇక్కడ అంత అవసరం లేదు. జస్ట్.. ప్రశ్న పోస్ట్ చేస్తే చాలు. తెలుగు కోరాలో చాలా ఆసక్తికరమైన ప్రశ్నలు కనిపిస్తాయి. ‘ఆకర్షణలకు తావులేని.. అమలిన ప్రేమ అనేది ఉందా?’ అని ఓ ప్రేమైక జీవి అడిగిన ప్రశ్నకు తిరుమలవర్మ సుధీర్‌రాజు చాలా మంచి సమాధానం ఇచ్చారు. ‘నా వయసు ముప్పై ఆరు. ఆస్తి లేదు. ఇంకా పెండ్లి కాలేదు. ఓ ఇంటివాడు కావడానికి ఏవైనా సలహాలు ఇవ్వండి’ అంటూ ఓ ముదురు బ్రహ్మచారి తన కష్టాన్ని చెప్పుకొన్నాడు. ఆ తాజా మాజీ యువకుడిని చాలామందే ఊరడించారు. అతనిలో ఆశావాదం రేకెత్తించారు. ఓ ఆకతాయి అయితే ‘పక్కింటి ఆంటీని వలలో వేసుకోవడం ఎలా?’ అంటూ ‘నిపుణుల’ సలహా అడిగాడు. అంతా కలిసి తలంటి పంపారు అనుకోండి! ఇదే వేదికపై ఆంత్రప్రెన్యూర్స్‌కు మాజీ గూగ్లర్ దాసు కిరణ్ సలహాలూ ఇస్తున్నారు. జై.. తెలుగు కోరా అనాల్సిందే!
ఏ సంస్థ నిలదొక్కుకోవాలన్నా బలమైన ఆర్థిక వనరులు ఉండాలి. ఎగుడుదిగుళ్లను తట్టుకోడానికి సరిపడా నిధులు ఉండాలి. కరోనా చేదు అనుభవం తర్వాత కోరా తన ఆర్థిక వ్యూహాల్ని మరింత పదునుపెట్టుకుంది. స్థిరమైన ఆదాయ మార్గాలను వెతికే పనిలో పడింది. తనకున్న ముప్పై కోట్ల మంది సభ్యులను చూపించి కార్పొరేట్లకు గాలం వేస్తున్నది. ఉదాహరణకు ‘ఏ రిఫ్రిజిరేటర్ కొనాలి?’ అని ఎవరైనా అడిగితే, ఫలానా సంస్థ ‘ఇవీ మా ఫీచర్లు’ అంటూ జవాబు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నది. అవసరమైతే ఆ కంపెనీ వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ చేస్తారు కూడా. కోరాలో న్యూస్‌లెటర్ వ్యవస్థ కూడా ఉంది. ఆ వారంలోని అత్యుత్తమ ప్రశ్నలు-జవాబులను మెయిల్ ద్వారా సబ్స్ర్కైబర్స్కు అందిస్తారు.