vivo V50e | ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు తక్కువ బడ్జెట్లోనే అధిక ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను వినియోగదారులకు అందిస్తున్నాయి. అందులో భాగంగానే ఏఐ ఫీచర్‌ను అందించేందుకు స్మార్ట్ ఫోన్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. కేవలం ఫ్లాగ్ షిప్ ఫోన్లలోనే కాకుండా ఇప్పుడు వస్తున్న దాదాపు అన్ని కంపెనీలకు చెందిన మిడ్ రేంజ్ ఫోన్లలోనూ ఏఐ ఫీచర్లను అందిస్తున్నారు. ఇక తాజాగా వివో కూడా ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను ఏఐ ఫీచర్లతో భారత్‌లో లాంచ్ చేసింది. వి50ఇ పేరిట వివో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్లో అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో 6.77 ఇంచుల అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల తెరపై దృశ్యాలు అత్యంత క్వాలిటీగా కనిపిస్తాయి. 4500 నిట్స్ వరకు బ్రైట్నెస్ను ఈ స్క్రీన్ కలిగి ఉంది.
ఈ ఫోన్‌కు ముందు భాగంలో ఉన్న 50 మెగాపిక్సల్ కెమెరా ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. వర్చువల్‌గా మరో 8 జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు. ఈ ఫోన్లో 50 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న కెమెరాను వెనుక వైపు ప్రైమరీ కెమెరాగా అందిస్తున్నారు. మరో 8 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న అల్ట్రా వైడ్ కెమెరా కూడా వెనుక వైపు ఉంది. ఈ కెమెరాలకు స్మార్ట్ కలర్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ అనే ఫీచర్‌ను అందిస్తున్నారు. వీటి సహాయంతో అద్భుతమైన 4కె వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. ఈ ఫోన్ ఐపీ 68, 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్లో స్మార్ట్ ఏఐ ఫీచర్‌ను అందిస్తున్నారు. దీంతోపాటు ఏఐ ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్, వివో లైవ్ కాల్ ట్రాన్స్లేషన్, సర్కిల్ టు సెర్చ్ వంటి ఇతర ఏఐ ఫీచర్లను కూడా ఇందులో అందిస్తున్నారు.
ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేసే ఫన్ టచ్ ఓఎస్ 15ను ఏర్పాటు చేశారు. ఈ ఓఎస్‌కు గాను 3 ఏళ్లవరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయని కంపెనీ తెలియజేసింది. ఈ ఫోన్లో 5600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి 90 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఈ ఫోన్ తెరకు డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ లభిస్తుంది. అందువల్ల స్క్రీన్ అంత సులభంగా డ్యామేజ్ అవదు. 8జీబీ ర్యామ్‌తో 128జీబీ లేదా 256 జీబీ స్టోరేజ్ మోడల్స్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్ వేసుకోవచ్చు. మైక్రో ఎస్డీ కార్డుకు చాన్స్ లేదు.
ఈ ఫోన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లను కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.28,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.30,999గా ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఆన్లైన్ స్టోర్, ఆఫ్ లైన్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను ఏప్రిల్ 17వ తేదీ నుంచి విక్రయిస్తారు. లాంచింగ్ కింద ఈ ఫోన్ పై హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ కార్డులతో 10 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే 10 శాతం అదనపు బోనస్ ఇస్తారు. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. వివో వి50ఇ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారు మరో రూ.1499 చెల్లిస్తే వివో ట్రూవైర్ లెస్ ఇయర్ బడ్స్‌ను పొందవచ్చు. ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే ఎస్బీఐ, హెచ్ఎస్బీసీ, అమెక్స్, డీబీఎస్, ఐడీఎఫ్సీ, కోటక్ వంటి బ్యాంకులకు చెందిన కార్డులపై 10 శాతం వరకు ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు.